Namassivaya Stotramu

నమశ్శివాయ  స్తోత్రము Jan-2014
ఓం నమశ్శివాయ  నమశ్శివాయ  నమశ్శివాయ , ఓం నమశ్శివాయ  
1 నమశ్శివాయను నా మనసందున, నభినుతి జేసెద నను కడ చేర్చుము         ఓం-
2 నమశ్శివాయను  మంత్రము నానా, నరకములను తెగ ద్రుంచునయా ఓం-
3 అతిదీనుడనై అనుదినమును నిను, మదిలో తలచెద బ్రోవుమయా ఓం-
4 పతితపావనా!  పన్నగ ధారణ!  పాలన సేయవె దయామయా  ఓం-
5 ఎంతని వేడుదు, పంతమ? నాపై  సుంతయు దయ రాదేలనయా ఓం-
6 శంభో హరహర మహదేవా నీ చరణములే గతి యంటినయా ఓం-
7 అండపిండ బ్రహ్మాండము లంతట నిండిన జ్యోతివి నీవేనయా ఓం-
8 ఆదియు మధ్యము, అంతము తెలియని, ఆనందామృత తత్వమయా ఓం-
9 ఇంద్రుడాదిగా సకల సురలకును, ఇష్ట దైవమగు మూర్తివయా ఓం-
10 ఈశ్వర నామొర నాలకింపవే, శాశ్వత గుణగణ సత్యావనా   ఓం-
11 ఉరగ విభూషణ నీదగు నామము, మరువగ జాలర మానసమున  ఓం-
12 ఊరడించి నను గావక యుండిన, ఓపజాల, గతి నీవేనయా  ఓం-
13 ఋతువులు మాసము లెన్నో గడచెను, వెతలు  దీర్చవెటు బోదునయా  ఓం-
14 ఎందుకు నీ దయ రాదు ?  పరాత్పర,  మందుడ నని కడు కోపమా ? ఓం-
15 ఏమియు తెలియని దీనుడ నైతిని పామర ముడిపియు పాలింపవే  ఓం-
16 ఐక్య స్వరూపము తెలసిన చాలుర ఆనందాంబుధి మునుగుదురా  ఓం-
17 ఒకటి రెండు మూడక్షరములలో సకలంబునకును సాక్షివయా  ఓం-
18 ఓంకారాత్మక మయమగు బ్రహ్మము నొందెడు మూలము  తెలుపుమయా  ఓం-
19 ఔరా ఏటికి నీదయ రాదుర ? అంత  కఠినమా  హర హర హర    ఓం-
20 అంతయు నీవై యుండగ  వేరే చింతలు నాకిక ఏలనయా  ఓం-
21 ఆలకింపుమిక  నాదగు మనవిని, అరమర సేయక ఆది దేవ  ! ఓం-
22 అహర్నిశంబును నీదగు మంత్రము- ననుసంధింపగ జేయుమయా  ఓం-
23 కమలసంభవా-ద్యమర గణావన, కంజలోచనా భవమోచన ఓం-
24 ఖగవాహన ప్రియ కరుణా సాగర, కంతు మదాపహరా  హర హర  ఓం-
25 ఘనమగు నీదగు కీర్తిని విని  నే, మనమున నమ్మితి గావుమయా    ఓం-
26 జ్ఞాత్రు జ్ఞాన జ్ఞేయము లొకటై, గాంచిన నీదయ కలుగునయా ఓం-
27 చదువుల లోపల చదువై వెలసిన సారము గ్రోలిన జాలునయా ఓం-
28 జనన మరణములు బొరయని  పదవికి, సాక్షిమాత్రుడవు నీవేనయా    ఓం-
29 ఝమ్మను ప్రణవ నాదము లోపల, గ్రమ్మిన వెన్నెల కాంతివయా  ఓం-
30 టక్కరి జగమున  మాయకు లోబడి, చిక్కితి నిన్నెటు గాంతునయా   ఓం-
31 డబ్బుకొరకు నిను జేరగ లేదయ,  మబ్బు తొలంగెడు మార్గమేదయా  ఓం-
32 ఢంకాది మహానందానందా, సంకటముల తొలగింపుమయా  ఓం-
33 తలచితలచి వేసారితి నీదయ, కలుగదాయె నిక నేమిసేతు  ఓం-
34 తారక యోగము దారి నెరింగిన ధన్యులు నీదయ గాంతురయా  ఓం-
35 దరిజేరుట నిక నెన్నడు తండ్రీ, తాపమాయెనిక తాళజాల  ఓం-
36 దారుణమగు ఈ సంసారాంబుధి, తీరము జేరగ దారిగదా  ఓం-
37 దుఃఖము తొలగెడు మార్గము నామది తోపగ జాయర దురితహరా  ఓం-
38 దండము దండము నీ పాదములకు, భండనభీమా భవభయ హర  ఓం-
39 ధన ధాన్యంబులు దార సుతాదులు, కనుగొన సర్వము మాయేనయా  ఓం-
40 నరక స్వర్గము-లాది ద్వంద్వము, బొరయని తత్వమె స్థిరమయ్యా  ఓం-
41 నానా రూపము-లందియు దేనిని, నంటక వెలిగెద-వద్భుతముగ  ఓం-
42 నిజముగ నిను మది నెరిగిన దాసులు నిఖిల-మెరింగిన వారేనయా  ఓం-
43 నీవే కర్తవు నీవే భర్తవు నీవే హర్తవు నీవేనయా  ఓం-
44 నీవే యజుడవు నీవే విష్ణువు నీవే హరుడవు నిరుపమ గుణ  ఓం-
45 నీకంటే పర దైవము లేదయ నిన్నే కొలిచెద నిర్ద్వంద్వా  ఓం-
46 నేను నీవనెడు ద్వైతము తొలగిన నీవే నేనై యుందునయా   ఓం-
47 నీవే నేనై నెగడిన తదుపరి నేమియు తెలుపగ జాలనయా  ఓం-
48 అన్ని మతంబులకాది  మూలమిది గన్న జన్మమిక సున్నయ్యా  ఓం-
49 ఆనందము దివ్యానందము బ్రహ్మానందము పరమానందము  ఓం-
50 పలుమరు నిను మది గొలచెడు ఘనులకు కలిగెడు భాగ్యము ఇదేనయా  ఓం-
51 పాప విదూరుడు పంచాక్షరి మది పఠనము చేయును భవభయ హర  ఓం-
52 ఫలమును కోరక కర్మలు చేసిన కలిగెడు సత్ఫల- మధికమయా  ఓం-
53 భజనలు  చేసిన భక్తుల కెల్లను పాపము తొలగుట సులభమయా  ఓం-
54 భూరి ఘోర సంసార మహాంబుధి తీరము జేరగ  దారి గదా  ఓం-
55 మర్మము తెలసిన మహనీయులకును కర్మము భస్మము జెందు గదా  ఓం-
56 మౌనముతో నీ మంత్రము మదిలో ధ్యానము చేయుట జ్ఞానమయా  ఓం-
57 మూర్ఖుల కందని మునిజన వందిత మోక్ష సాధనము ఇదే గదా  ఓం-
58 మహదేవా హర ! శంభో నీదగు మహత్య మేమని ఎంతునయా  ఓం-
59 ముందుగ నీదయ కల్గిన యాపై మోక్షము చెందుట సులభమయా  ఓం-
60 యతిజన వందిత నీవే గతి యని సతతము గొలిచెద సాంబశివా  ఓం-
61 రజితాచలమున కధినాధుండవు రాజరాజప్రియ రాజధరా    ఓం-
62 రామ తారకము బోధన జేసిన రాజగురుండవు నీవేనయా   ఓం-
63 రాత్రియు పగలును లేని స్థలంబున రంజిలుచుండెడు పాతకహర   ఓం-
64 రూపము నామము నిలయము  నొందిన-దాపున వెలిగెడు ధన్యగుణా  ఓం-
65 లవలేశంబును; ఘనమును; గొను, విలక్షణమూర్తి విలాసమయా  ఓం-
66 వశమౌ నేనిను పొగడగ జాలర!  పశుపతి సర్వము నీవేనయా  ఓం-
67 వావి భేదమూ, మోదము, ఖేదము లేదని దెలసిన రాదిక జన్మము  ఓం-
68 వింటి నీ యశము,  నేనంటిని శరణని కంటకముల ముక్కంటి బాపు  ఓం-
69 వీనుల విందుగ నీ చరితంబులు విన్న భవంబులు  మన్నౌనుర ! ఓం-
70 వేషము లెన్నో వేసిన ఘనమా శేష భూష నిను జేరకున్న  ఓం-
71 వైరము  కామము  లోభము  వదలిన  ధీరులకే  ఈ  దారి  గదా  ఓం-
72 వేదములే  నిను  కనుగొన  జాలక  వెదకిన  నీ  ఘన  మేమయ్యా  ఓం-
73 శమ దమాది గుణ జాలము లేకను శక్యము గాదుర నిని గనుటకు  ఓం-
74 శాంతి శాంతి యను మంత్రము నిరతము చవి నెరింగి జపియింతునయా  ఓం-
75 శుచిగా ప్రణవము భావన జేసిన శుద్ధులు మది నిను  గాంతురయా ఓం-
76 శౌరికి ప్రియుడవు సర్వ గురుండవు సాంబశివుండవు  సాధుపాల  ఓం-
77 శైలసుతా హృదయాంబుజ భాస్కర శూలపాణి దయ జూడుమయా  ఓం-
78 శోభన గుణగణ నీ నామము రుచి చూసిన యమృత మికేలనయ  ఓం-
79 షణ్ముఖ జనక సురాసుర వందిత సామజ చర్మాంబర ధర హర  ఓం-
80 సకలము నీవై సాక్షిగ నుండెడు జాడ నెరింగిన జాలునయా    ఓం-
81 సాకారంబు నిరాకారంబును ఏకమైన తెరవిదేనయా  ఓం-
82 సీతాపతి వర నామము నీ యెద సిద్ధి  గాంచుట ప్రసిద్ధమయా  ఓం-
83 హరహర తారక మంత్ర స్వరూపము అర క్షణంబును మరువనయా  ఓం-
84 క్షరా క్షరంబుల కవ్వలి పదవికి జాడ నెరుంగగ జేయుమయా  ఓం-
85 శివ శివ నీపద చింతన గలిగిన సిద్ధము మోక్షము సిద్ధమయా ఓం-
86 శూలి మహేశ్వర నాపై నింకను జాలి కలుగదిక ఏలనయా ఓం-
87 శంకర నీదగు కింకరుడని  నా  సంకటముల తొలగింపవయా   ఓం-
88 మృత్యుంజయ భూతేశ్వర మాకిక  మృత్యుభయము తొలగింపవయా   ఓం-
89 చంద్రశేఖరా సాంద్ర దయాకర శరణాగతజన రక్షణగుణ  ఓం-
90 ప్రమథాధిప నీ పాదపద్మముల ప్రణుతిజేతు దయ జూడుమయా ఓం-
91 శ్రీకంఠా శితికంఠా నిను నుతి జేసిన జన్మము ధన్యమయా  ఓం-
92 వామదేవ త్రిపురాంతక వృషభ సువాహనయుత మాం పాహి పాహి  ఓం-
93 వ్యోమకేశ భవభీమ యనుచు నీ నామ భజనయే మాననయా  ఓం-
94 గంగాధర నీ పాదంబుల కిదే సాష్టాంగ నమస్కారమయా     ఓం-
95 తారక మంత్ర మనస్కయోగ విచార సుందరాకార హరా   ఓం-
96 నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నిజమయ్యా  ఓం-
97 బాలుడ నీదయ జాల వహించియు మేలుగ నను దయ నేలుమయా   ఓం-
98 తప్పుల  సైచెడు దాతవు నీవని తలచి వినుతి జేసితి నయ్యా    ఓం-
99 తెలసితి నీదగు మహిమను ఇకనా తలపు నీపైన తప్పదయా    ఓం-
100 అద్వైతంబను అమృతము గ్రోలగ యాధారము నీ నామమయా  ఓం-
101 హృదయ కమలమున కుదురుగ నిలచియు ముదము నొసంగర సదయుడవై  ఓం-
102 శరణము శరణము శరణము భవహర జయ జయ శంభో సాంబశివా ఓం-
103 వ్యాసాశ్రమమున వాసిగ వెలుగుచు దాసుల బ్రోచిన దాతవయా  ఓం-
104 భక్తాశ్రమమున తేజరిల్లుచును భక్తుల గాచిన శక్తివయా ఓం-
105 శ్రీ మళయాళా సద్గురువర్యుల చరణాంబుజముల గొలుతునయా ఓం-
106 నాగ లింగధర భక్త జనోద్ధర నన్నిక మరువగ వలదయ్యా ఓం-
107 వరద! దాసహృదయాంబుజ భాస్కర!  హరహర హరహర హరహర హర! ఓం-
108 మంగళమగు, జయ మంగళమగు, శుభ మంగళమగు హర, మంగళకర ఓం-
--------------------------------------------------------------------
         వివరణలు  
10 సత్యావన = సత్య+ అవన (సం) = సత్యమను ఆనందము గలవాడు; సత్యమును కాపాడువాడు  
15 పామర ముడిపియు = అజ్ఞానము నశింప జేసి 
21 అరమర సేయక = సందేహింపక 
23 కమలసంభవా-ద్యమర గణావన =బ్రహ్మ మొదలగు అమర సమూహములను రక్షించువాడు 
కంజలోచనా = ఫాలలోచనా 
24 కంతు (సం) = మన్మథుడు;  మదాపహర = మదమును అణచిన వాడు 
38 భండన భీమ = యుద్ధ భయంకరుడు 
45 నిర్ద్వంద్వా = ద్వంద్వాతీతుడు 
54 భూరి = గొప్ప 
61 రజితాచలము =  కైలాసము 
రాజరాజప్రియ = చంద్రునిచే సేవింప బడు వాడు 
రాజధరా = చంద్రుని ధరించిన వాడు 
62 రాజగురుండవు = జగద్గురువు
65 లవలేశంబును ఘనమును గొను =సూక్ష్మ మైన అణువును,  బ్రహ్మాండమును  ధరించిన 
విలక్షణము  = విచిత్రము 
67  వావి భేదము = తాను, ఇతరులు అను తేడా 
91 శ్రీకంఠా = అందమైన కంఠము గలవాడు;   శితికంఠా = నీల కంఠుడు
93 వ్యోమకేశ = ఆకాశము నాక్రమించే జటాజూటము గలవాడు  
భవభీమ = జనన మరణ చక్రమునకు భయంకరుడు, వానినుండి రక్షించు వాడు 
95 తారక మంత్ర మనస్కయోగ విచార = మనస్సు లో తారక మంత్ర విచారణ చేయు వాడు 
103 వ్యాసాశ్రమము =చిత్తూరు జిల్లా, ఏర్పేడులో మళయాళ స్వామీజీ 
తపస్సు చేసిన వ్యాసాశ్రమము గలదు. 

మళయాళ స్వామీజీ ఈ నమశ్శివాయ స్తోత్రమును రచించెను. ఆయన కేరళ రాష్ట్రములో జన్మించి, 10 సంవత్సరములు (1905-1914) హిమాలయములలో తపస్సు చేసెను చివరకు 1926 లో కాళహస్తి వద్ద గల ఏర్పేడులో వ్యాసాశ్రమమును స్థాపించి, ప్రజలను భక్తి మార్గము లోనికి పురికొల్పెను. ఆయన అనేక పుస్తకములు రచించెను. వానిలో ముఖ్యమైనది శుష్క వేదాంత తమో భాస్కరముఅంతేగాక,  ఆయన యదార్థ భారతి అను ఆధ్యాత్మిక తెలుగు పత్రికను నడిపి, ప్రజలను జాగృతులను చేసెను.
106 నాగ లింగధర = నాగేశ్వరుడను జ్యోతిర్లింగ స్వరూపము ధరించిన వాడు 
107 దాసహృదయాంబుజ భాస్కర = దాస హృదయములను కమలములకు భాస్కరుని వంటి వాడు 

No comments: