హనుమాన్ చాలీసా అనువాదం శ్రీ S.K. జయచంద్ర , IPS
ముందుమాట
రామ భక్తుడు, సంఘ సంస్కర్త అయిన మహాకవి గోస్వామి
తులసీ దాసు 16
వ శతాబ్దానికి చెందిన వాడు. ఆయనకు తాను రచించిన హనుమాన్ చాలీసాతో చాలా దగ్గరి సంబంధము గలదు. తులసీ
దాసు ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలోని
రాజాపూర్ అనే గ్రామములో జన్మించాడు.
పుడుతూనే రామ శబ్దాన్ని పలకడంతో ఆయనకు రామ్ బోలా అని పేరు పెట్టారు; కాని చెడు ముహూర్తములో పుట్టడముతో తల్లిదండ్రులు విడిచి
పెడితే ఒక దాది పెంచి, కొంచము పెద్దవాడయ్యాక మరణించినది.
తరువాత ఆయనను ఐదవ ఏటనుండి నరహరిదాస్ అనే విష్ణు భక్తుడు పెంచుకొని , అయోధ్యలో ఉపనయనము చేసి 'తులసీ దాసు'
అని పేరు పెట్టాడు.
తులసీ దాసు భార్య పేరు రత్నావళి. ఒక
రాత్రి ఆమెను కలవడానికి తులసీ దాసు యమునా నదిని ఈదుకొని వెళ్ళాడు. అది తెలిసిన
రత్నావళి “ఈ నా శరీరముపై చూపిన ప్రేమలో సగమైనా రామునిపై చూపితే తరిస్తావు గదా” అని నిందించినది. ఇది విని తులసీ దాసు లో వైరాగ్యము పుట్టి చివరకు
సన్యసించాడు.
హనుమద్దర్శనము: తులసీ
దాసు వారణాసి చేరి ప్రతి రోజు ఉదయము పూజ
చేసి నీళ్ళు ఒక చెట్టు మొదట్లో వదులుతూ ఉండేవాడు . తిరిగి సాయంత్రము ఒక చోట రామాయణము చెప్తూ ఉండేవాడు . కొంత కాలానికి ఆ చెట్టుపై ఉండే ఒక ప్రేతము
కర్మ పరిపాకము చెంది తులసీ దాసుకు
ప్రత్యక్షమై వరాన్ని కోరుకో మన్నది. తులసీ దాసు రాముని చూపించు మనగా అది తాను
చేయలేని పని అని తెలిపి, చివరకు హనుమంతుని
చూపించ గలనని,
ఆయనను వేడు కొంటే రాముడు కనిపించవచ్చనీ చెప్పింది.
ఆ ప్రేతము సూచించిన విధముగా తాను
రామాయణము చెప్పేచోట మొదటగా వచ్చి చివరగా వెళ్ళే ఒక ముసలి భక్తునిపై దృష్టి పెట్టి ఆయనను అనుసరించి అడవిలోకి వెళ్లి
కాళ్ళపై బడగా ఆయన తానే హనుమంతుడనని తెలిపి
నిజరూపముతో దర్శనమిచ్చి, రామదర్శన
మౌతుందని ఆశీర్వదిస్తాడు. తులసీ దాసు వారణాసిలో హనుమంతుని తాను దర్శించిన ప్రదేశములో సంకట మోచన
హనుమాన్ దేవాలయాన్ని నిర్మిస్తాడు. తరువాత ఆయన అయోధ్య
చేరుకొని అక్కడ రామాయణాన్ని 'రామ చరిత మానస్' అనే పేరుతో ‘అవధి’ అనే ప్రాంతీయ భాషలో రచించాడు. రామచరిత మానస్ లోని ప్రార్థనా శ్లోకాలలో ఆ ప్రేతము
గురించిన ప్రస్తావన ఉన్నది (రామచరిత మానస్, దోహా 1.7).
తులసీదాసును వాల్మీకి అవతారముగా
భావిస్తారు: వాల్మీకి స్తులసీదాసః కలౌ దేవి భవిష్యతి | రామచంద్రకథా మేతాం భాషాబద్ధామ్ కరిష్యతి
| (భవిష్యోత్తర పురాణము , ప్రతిసర్గపర్వము, 4.20)
రామ దర్శనము: హనుమంతుని ఆజ్ఞ ప్రకారము తులసీ దాసు చిత్రకూటమును
చేరి అక్కడ గంగా నదీ తీరములో రామఘాట్ అనే
ఆశ్రమమును నిర్మించుకొని శ్రీరామునికై అన్వేషణ ప్రారంభిస్తాడు. ఒక రోజు తులసీ దాసు
దగ్గరలో గల కామదగిరి పర్వత పరిక్రమము చేస్తుండగా ఇద్దరు రాకుమారులు గుర్రాలపై
కనిపిస్తారు. కాని ఆయన వారిని రామలక్ష్మణులుగా గుర్తించలేదు . ఆరోజు సాయంత్రము హనుమంతుడు దర్శనమిచ్చి
గుర్రాలపై రామలక్ష్మణులను చూశావా అని
అడుగుతాడు.
అపుడు తులసీ దాసు తన అజ్ఞానానికి ఎంతో
బాధపడతాడు . ఇదిచూసి హనుమంతుడు కరుణించి
మరునాడు మరో రూపములో రాముడు దర్శన మీయ గలడని ఆశీర్వదిస్తాడు . మరునాడు తులసీ దాసు పూజకు గంధమును తయారు
చేస్తుండగా ఒక బాలకుడు వచ్చి బొట్టు పెట్టమని అడుగుతాడు. అపుడు హనుమంతుడు కనిపించి సైగ చేయగా రాముని
గుర్తించిన తులసీ దాసు ఆశ్చర్యానందములతో చేష్టలుడిగి రాముని చూస్తూ ఉండి పోతాడు. అప్పుడు రాముడు నవ్వుతూ తానే గంధాన్ని తీసుకొని
బొట్టు దిద్దుకొని అదృశ్య మౌతాడు.
హనుమాన్ చాలీసా: తులసీ దాసు ఒక మారు మరణించిన ఒక బ్రాహ్మణుని బ్రతికించగా ఆ విషయము
విని అప్పటి సుల్తాను అక్బరు ఆయనను మహిమలు
చూపించమని అడుగుతాడు. తులసీ దాసు
ఒప్పుకొనక తనకు రాముడు తప్ప మరేమీ తెలియదని అంటాడు. అప్పుడు అక్బరు “ఆ రాముని
చూపించే వరకు నీవు బందీవై ఉండు”, అంటూ ఆయనను ఫతేపూరు సిక్రీ కారాగారములో బంధిస్తాడు. అప్పుడు తులసీ దాసు హనుమాన్ చాలీసాను రచించి
భక్తితో 40
రోజులు కారాగారములో పారాయణము చేస్తాడు.
అంతట కొన్నివేల కోతులు వచ్చి ప్రతిరోజూ
ఫతేపూరు సిక్రీ పట్టణములో అందరిని రక్కి, అక్బరు కోటలో చాలామందిని గాయపరుస్తూ వచ్చాయి. ఇది గమనించిన ఒక ముస్లిం హఫీజు ఇది తులసీ దాసు మహిమేనని అక్బరుకు చెప్పగా అక్బరు, తులసీ దాసు కాళ్ళపై బడి క్షమించమని కోరుకొని ఆయనను విడుదల చేస్తాడు. అంతే
కాదు. రామ భక్తులను, హనుమంతుని భక్తులను ఎవరూ ఏమీ అనరాదని ఒక ఫర్మానా కూడా జారీ చేస్తాడు. అప్పుడా కోతులు తిరిగి వెళ్లి
పోతాయి. తరువాత తులసీ దాసు ఆజ్ఞ మేరకు అక్బరు ఫతేపూరు సిక్రీ విడిచిపెట్టి ఢిల్లీకి వెళ్లిపోతాడు.
హనుమాన్ చాలీసాలో ముందుగా ప్రార్థనా శ్లోకాలు చెబుతారు.
తరువాత 2 దోహాలు (అనగా రెండు పంక్తుల పద్యాలు)
ప్రారంభము లోను,
ఒక దోహా చివరి లోను ఉంటాయి. ఇవి కాక మధ్యలో 40 చౌపాయీలు అనే పద్యాలు ఉంటాయి. చౌపాయీలు 40 ఉండుట వలన ‘చాలీసా’ అనే పేరు
వచ్చినది.
మహా మహిమాన్వితమైన ఈ హనుమాన్
చాలీసాను అందరూ భక్తితో పారాయణము చేసి హనుమంతుని కృపకు పాత్రులగుదురని ఆశిస్తాను.
-- జయచంద్ర
హనుమాన్ చాలీసా
ప్రార్థన
అతులిత బలధామం
స్వర్ణ శైలాభ దేహం
దనుజ వన
క్రుశానుం జ్ఞానినామగ్రగణ్యం
సకలగుణ నిధానం
వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం
వాతజాతం నమామి
అర్థములు: అతులిత బలధామం = పోల్చలేని బల పరాక్రమములు; స్వర్ణ శైలాభ దేహం = బంగారు పర్వతము వంటి దేహము గలిగి; దనుజ వన క్రుశానుం = రాక్షసులనే వనమును (లేదా) అశోక వనమును
ధ్వంసము చేసినటు వంటి వాడు; జ్ఞానినామగ్రగణ్యం = జ్ఞానులలో అత్యుత్తముడు; సకలగుణ నిధానం = సకల సద్గుణ రాశి; వానరాణా మధీశం = వానరాధీశుడు; రఘుపతి ప్రియభక్తం = శ్రీరామునికి ప్రియ భక్తుడు; (అయిన) వాతజాతం నమామి = వాయు పుత్రునికి
నమస్కారము
తాత్పర్యము: అసామాన్య బలస్వరూపుడు, బంగారు పర్వతము వంటి
దేహము గలవాడు,
రాక్షస వనాన్ని
నశింప జేసిన వాడు,
జ్ఞానులలో
అగ్రగణ్యుడు,
సకల సద్గుణ రాశి, వానర రాజు, శ్రీరామ భక్తుడు అయిన వాయు పుత్రునికి నమస్కారము.
గోష్పదీ కృత వారాశిం
మశకీకృత రాక్షసమ్
రామాయణ మహామాలా రత్నం
వందే అనిలాత్మజమ్
అర్థములు: గోష్పదీ కృత = గోష్పద +
ఈకృత = గోవు అడుగు వలె; వారాశిం = సముద్రాన్ని (
దాటి); మశకీకృత = మశక + ఈకృత = దోమలవలె; రాక్షసమ్ = రాక్షసులను (వధించిన); రామాయణ మహామాలా రత్నం =
రామాయణ మనే గొప్ప మాలలోని రత్నమైన; వందే అనిలాత్మజమ్ = అనిలపుత్రునికి
నమస్కారము
తాత్పర్యము: మహా సముద్రాన్ని గోవు
అడుగు వలె దాటి, రాక్షస సమూహములను దోమలవలె వధించిన రామాయణ మహామాలలోని రత్నము వంటి వాయు పుత్రునికి నమస్కారము
యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృత
మస్తకాంజలిం
బాష్ప వారి పరిపూర్ణ
లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం
అర్థములు: యత్ర యత్ర = ఎక్కడెక్క
డైతే; రఘునాధ కీర్తనం = రామ నామ కీర్తన జరుగుతుందో; తత్ర తత్ర = అక్కడక్కడ; కృత మస్తకాంజలిం = చేతులు జోడించి నమస్కరిస్తూ; బాష్ప వారి
పరిపూర్ణ = ఆనంద బాష్పములతో నిండిన; లోచనం = కన్నులతో ఉండే; రాక్షసాంతకం = రాక్షసాంతకుడైన; మారుతిం నమత = మారుతికి
నమస్కారము.
తాత్పర్యము: ఎక్కడెక్క డైతే రామ నామ సంకీర్తన
జరుగుతుందో, అక్కడ ఆనంద బాష్పములతో నిండిన కన్నులతో చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండే రాక్షసాంతకుడైన మారుతికి నమస్కారము.
శ్రీరామ భక్తాయ హనుమతే
నమః = రామ భక్తుడైన హనుమంతునికి నమస్కారము
హనుమాన్ చాలీసా ప్రారంభం
దోహా:
శ్రీగురు
చరణ సరోజ రజ నిజ మన ముకుర
సుధార్
వరణౌ రఘువర
విమల జసు జో
దాయక ఫల చార్
అర్థములు: శ్రీగురు చరణ = శ్రేయోదాయక
మైన గురు చరణము లనెడు; సరోజ= పద్మముల యొక్క; రజ=ధూళితో; నిజ మన =నా మనస్సు అను; ముకుర = అద్దమును; సుధార్ = శుభ్రము
చేయుదును, పవిత్రము చేయుదును; (మరియు) , ఫల చార్ =చతుర్విధ ఫలములను; జో దాయక్= ఎవడు యిచ్చునో; (అట్టి) రఘువర =రఘు కుల తిలకు డైన
రాముని; విమల =నిష్కళంక మైన ;
జసు =యశస్సును, కీర్తిని; వరణౌ = వర్ణించెదను.
తాత్పర్యము: శ్రేయోదాయక మైన గురువుల
పాద పద్మముల యొక్క ధూళి తో నా మనస్సు అనెడి అద్దమును శుభ్ర పరచెదను. ధర్మార్ధ కామ మోక్షము లనెడు చతుర్విధ ఫలముల
నిచ్చే శ్రీరామచంద్రుని నిష్కళంక మైన కీర్తిని వర్ణించెదను
దోహా:
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్
బల బుద్ధి విద్యా దేహు మోహి
హరహు కలేశ వికార్
అర్థములు: తను = దేహము, వ్యక్తి ; బుద్ధిహీన = బుద్ధి లేనిదని; జానికే = తెలుసుకొన్న నేను; పవన కుమార్ = పవన కుమారుడైన హనుమంతుని; సుమిరౌ = స్మరించెదను; బల, బుద్ధి
విద్యా = బలమును, బుద్ధిని, విద్యను; దేహు
మోహి = నాకిమ్మని (మరియు), కలేశ = క్లేశము, దుఃఖము; వికార్ = ఆరు విధములైన జనన మరణాది వికారములు,
కామ క్రోధాది మనస్సంబంధ మైన దుర్గుణములు; హరహు
= హరించుము, నిర్మూలించుము (అని ప్రార్ధించెదను)
తాత్పర్యము: ఈ దేహము
దోష పూరిత మైన దని,
బుద్ధి లేక
మరల మరల తప్పులు
చేయు నైజము కలదని తెలుసుకొన్న నేను పవన కుమారుడైన హనుమంతుని స్మరించెదను. మరియు బలమును, బుద్ధిని, జ్ఞానమును
నాకిమ్మని, నాయొక్క దుఃఖమును, వికారములను నిర్మూలించమని ఆయనను వేడుకొందును.
చౌపాయీలు … 40
1.
జయ హనుమాన్ జ్ఞాన గుణ
సాగర
జయ కపీశ తిహు( లోక ఉజాగర
అర్థములు: జ్ఞాన గుణ సాగర
= సద్గుణములకు, జ్ఞానమునకు సాగరము వంటి వాడగు; జయ హనుమాన్ = హనుమంతునికి
జయమగుగాక! ; తిహు( లోక = మూడు లోకములను; ఉజాగర = ప్రకాశింప
జేయు; జయ కపీశ
= వానర రాజునకు జయమగుగాక!
తాత్పర్యము: సద్గుణములకు, జ్ఞానమునకు సాగరము వంటి వాడు,
తనతేజముచే ముల్లోకములను ప్రకాశింప జేయు వాడు అగు వానర రాజైన హనుమంతునికి జయమగుగాక!
2.
రామదూత అతులిత బల ధామా
అంజని పుత్ర పవనసుత నామా
అర్థములు: రామ దూత = (నీవు) శ్రీ రాముని దూతవు, అతులిత = అసామాన్యమైన; బల ధామా = బల శాలివి; అంజని
పుత్ర = అంజని
పుత్రుడు, పవనసుత = పవనసుతుడు (అను) నామా = నామములు గలవాడవు
తాత్పర్యము: ఓ హనుమంతుడా ! నీవు శ్రీ రాముని దూతవు.
అతులిత బలశాలివి. మరియు అంజని పుత్రుడు, పవనసుతుడు అను
నామములు గలవాడవు.
3.
మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార!
సుమతి కే సంగీ
అర్థములు: (నీవు ) మహావీర = మహా వీరుడవు; విక్రమ = దుష్కార్యములు
సాధించువాడవు; బజరంగీ
= వజ్ర + అంగీ = వజ్ర శరీరుడవు;
సుమతి కే = (ఓ
) సన్మార్గుల, సాధువుల యొక్క ; సంగీ = మిత్రుడా! ; కుమతి నివార = (నా)
దుర్గుణములను నివారించుము;
తాత్పర్యము: హే హనుమాన్
! నీవు మహా వీరుడవు. దుష్కార్యములను కూడా సులభముగా సాధించు వాడవు వజ్ర శరీరుడవు. ఓ సాధు మిత్రుడా! నా దుర్గుణములను నిర్మూలించుము.
4. కాంచన వరణ విరాజ
సువేసా
కానన కుండల కుంచిత
కేశా
అర్థములు: కాంచన వరణ = బంగారు
రంగుతో; విరాజ =
ప్రకాశించు వాడవు; సువేసా = చక్కని రూపము,
అలంకారములు; (మరియు) కానన
కుండల = చెవులకు కుండలములు, కుంచిత కేశా = ఉంగరాల జుట్టు గల వాడవు.
తాత్పర్యము: ఓ మహావీరా ! నీవు బంగారు వర్ణముతో శోభిల్లు వాడవు. చక్కని రూపము, అలంకారములు మరియు చెవులకు కుండలములు, ఉంగరాల జుట్టు
గల వాడవు.
5.
హాథ వజ్ర ఔర్
ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై
అర్థములు: హాథ = చేతిలో; వజ్ర = వజ్రాయుధము (వంటి గద); ఔర్ = మరియు; ధ్వజా = ధ్వజము లేదా జెండా; విరాజై = విరాజిల్లుచుండును;
కాంధే = భుజము పై; మూంజ = మూంజ అను ఒక రకమైన
గడ్డితో చేసిన;
జనేవూ = జంధ్యము; సాజై = అలంకరింపబడి యుండును
తాత్పర్యము: నీ చేతులలో వజ్రాయుధము వంటి గద మరియు జెండా విరాజిల్లుచుండును. మరియు భుజము పై మూంజ అను గడ్డి
తో చేసిన జంధ్యము సదా అలంకరింపబడి యుండును.
6. శంకర సువన కేసరీ
నందన
తేజ ప్రతాప మహా
జగ వందన
అర్థములు: (నీవు ) శంకర సువన = శంకరుని తేజస్సు, అవతారము; కేసరీ నందన = కేసరి అను వానర రాజు యొక్క పుత్రుడవు; తేజ = తేజము వలన; ప్రతాప = ప్రతాపము వలన;
మహాజగ = సమస్త జగముచే; వందన = నమస్కరింప బడువాడవు, పూజింప బడువాడవు
తాత్పర్యము: నీవు సాక్షాత్తు శంకరుని అవతారము మరియు కేసరీ నందనుడవు. నీ తేజో పరాక్రమముల వలన సమస్త ప్రపంచము చేత
పూజింప బడువాడవు.
7. విద్యావాన గుణీ అతి
చాతుర
రామ కాజ కరివేకో
ఆతుర
అర్థములు: విద్యావాన = నీవు
సమస్త విద్యలను అభ్య సించిన వాడవు; గుణీ = సద్గుణ వంతుడవు; అతి చాతుర = అత్యంత కుశలము గలవాడవు (మరియు)
; రామ కాజ = రామ కార్యమును; కరివేకో = చేయుటకు; ఆతుర = ఆత్రుత పడుచుందువు
తాత్పర్యము: నీవు సూర్యుని నుండి
సమస్త విద్యలను అభ్యసించిన వాడవు, సద్గుణ స్వరూపుడవు; కార్య నిర్వహణలో గొప్ప
చాతుర్యము గలవాడవు. మరియు రామ కార్యమును నిర్వహించుటకు అత్యంత ఆత్రుత పడుచుందువు
8. ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా
అర్థములు: ప్రభుచరిత్ర = నీ ప్రభువైన
రాముని చరిత్రను;
సునివే కో = వినుచు;
రసియా = ఆనందించెదవు (మరియు); రామ లఖన సీతా = సీతా రామ లక్ష్మణులను; మన = నీ హృదయములో; బసియా = నివసింప జేసినవాడవు.
తాత్పర్యము: ఓ హనుమా ! నీ
ప్రభువైన రాముని చరిత్రను వినుచు
పులకించి పోతావు. మరియు సీతారామ
లక్ష్మణులను నీ హృదయములో నివసింప జేసిన వాడవు
9. సూక్ష్మ రూప ధరి సియహి( దిఖావా
వికట రూప ధరి
లంక జలావా
అర్థములు: సూక్ష్మరూప ధరి = సూక్ష్మరూపమును ధరించి; సియహి( దిఖావా = సీతను దర్శించావు; వికటరూప ధరి = మహా కాయుడవై ; లంక జలావా = లంకను కాల్చావు
తాత్పర్యము: ఓ హనుమా ! నీవు సూక్ష్మరూపమును ధరించి అశోక వనములో సీతాదేవిని
దర్శించావు. తరువాత
మహా కాయుడవై లంకను దహించావు.
10. భీమరూప ధరి అసుర సంహారే
10. భీమరూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సంవారే
అర్థములు: భీమరూప ధరి = భీకరమైన రూపమును ధరించి; అసుర సంహారే = రాక్షస సంహారము చేసావు; (మరియు); రామచంద్రకే
కాజ = రామ కార్యమును; సంవారే= నిర్వర్తించావు
తాత్పర్యము: ఓ హనుమా ! తరువాత నీవు, భయంకర రూపముతో రాక్షస సంహారము చేసి, రామ కార్యమును నిర్వర్తించావు
11. లాయ సజీవన లఖన జియాయే
శ్రీ
రఘువీర హరషి ఉర లాయే
అర్థములు: లాయ సజీవన = సంజీవని పర్వతాన్ని తెచ్చి; లఖన జియాయే = లక్ష్మణుని
జీవింప జేశావు; శ్రీ
రఘువీర = (అప్పుడు) శ్రీరామచంద్రుడు; హరషి = సంతోషముతో; ఉర లాయే = (నిన్ను) ఆలింగనం
చేసుకున్నాడు
తాత్పర్యము: ఇంద్రజిత్తు తో యుద్ధము చేసి, లక్ష్మణుడు మూర్ఛ పోగా నీవు సంజీవని పర్వతాన్ని తెచ్చి అతనిని జీవింప జేశావు. అప్పుడు శ్రీరామచంద్రుడు సంతోషముతో నిన్ను ఆలింగనం
చేసుకున్నాడు.
12. రఘుపతి కీన్హీ బహుత
బడాయీ
తుమ మమ
ప్రియ భరత హి సమ భాయీ
అర్థములు: రఘుపతి = శ్రీరామచంద్రుడు (నిన్ను); కీన్హీ బహుత
బడాయీ = ఎంతో పొగడ్త చేసాడు; తుమ = నీవు;
మమ ప్రియ = నా ప్రియమైన; భరత హి సమ భాయీ = సోదరుడు భరతునితో సమానము (అన్నాడు)
తాత్పర్యము: అంతే కాదు. శ్రీరామచంద్రుడు నిన్ను ఎంతో
మెచ్చుకొన్నాడు. మరియు నీవు నా ప్రియ సోదరుడు భరతునితో సమానము అని గౌరవించాడు.
13. సహస వదన తుమ్హరో
యశ గావై(
అస కహి
శ్రీపతి కంఠ లగావై(
అర్థములు: సహస వదన = వేయి పడగలు గల ఆదిశేషుడు; తుమ్హరో = నీయొక్క; యశ గావై( = యశస్సును కీర్తించు గాక! అస కహి = అట్లా అని; శ్రీపతి = శ్రీరామచంద్రుడు (నిన్ను); కంఠ లగావై( = ఆలింగనం చేసుకున్నాడు.
తాత్పర్యము: “వేయి పడగలు గల ఆదిశేషుడు నీ యశస్సును కీర్తించు గాక!”
అంటూ శ్రీరామచంద్రుడు నిన్ను ఆలింగనం
చేసుకున్నాడు.
14. సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద
సహిత అహీశా
అర్థములు: సనకాదిక = సనక సనందనాది మహాఋషులు; బ్రహ్మాది = బ్రహ్మాది దేవతలు; మునీశా = మునీశ్వరులు; నారద = నారదుడు; శారద = సరస్వతి; సహిత = ఇత్యాదులు; అహీశా = సర్ప రాజులు (నీ యశస్సును కీర్తించలేరు)
తాత్పర్యము: సనక సనందనాది ఋషులు, బ్రహ్మ, సరస్వతి, నారదుడు, ఆదిశేషుడు ఇత్యాదులు
నీ యశస్సును కీర్తించలేరు.
15. యమ కుబేర దిక్పాల జహా( తే
కవి కోవిద కహి సకై కహా( తే
అర్థములు: యమ కుబేర = యముడు, కుబేరుడు ఇత్యాది;
దిక్పాల జహా( తే = దిక్పాలకుల నుండి (మొదలు కొని) ; కవి కోవిద = కవి పండితుల వరకు; కహా( తే = ఎక్కడ (నీ గొప్పదనము); కహి సకై = చెప్పగలరు?
తాత్పర్యము: హే హనుమా! యముడు, కుబేరుడు ఇత్యాది దిక్పాలకులు మొదలు కొని, కవి
పండితుల వరకు ఎక్కడ నీ గొప్పదనము కీర్తించ గలరు ?
16. తుమ ఉపకార సుగ్రీవహి( కీన్హా
రామ మిలాయ రాజపద
దీన్హా
అర్థములు: సుగ్రీవహి( = సుగ్రీవునకు; రామ
మిలాయ = రామునితో స్నేహము కలిపి; తుమ ఉపకార = నీవు ఉపకారము; కీన్హా = చేసావు; రాజపద = రాజ్య సింహా సనాన్ని; దీన్హా = ఇప్పించావు
తాత్పర్యము: నీవు సుగ్రీవునకు రామునితో స్నేహము కలిపి, గొప్ప
ఉపకారము చేసావు. మరియు అతడికి రాజ్య సింహాసనము తిరిగి ఇప్పించావు.
17. తుమ్హరో మంత్ర విభీషణ
మానా
లంకేశ్వర భయే
సబ జగ జానా
అర్థములు: తుమ్హరో = నీ యొక్క;
మంత్ర = సలహా, రామ మంత్రము;
విభీషణ మానా =
విభీషణుడు పాటించి; లంకేశ్వర
భయే = లంకేశ్వరుడుగా ఉన్నట్లు, లంకకు రాజై నట్లు; సబ జగ జానా = ప్రపంచ మంతట తెలియును.
తాత్పర్యము: విభీషణుడు నీ సలహాను పాటించి,
రామ భక్తుడై చివరకు లంకేశ్వరు డైనట్లు ప్రపంచ మంతట తెలియును.
నీ మంత్రాంగము అంత గొప్పది
వివరణ: భయే ( भये ) అనగా ఉండుట, ఉనికి అని అర్థము
18. యుగ సహస్ర యోజన
పర భానూ
లీల్యో తాహి
మధుర ఫల జానూ
అర్థములు: యుగ సహస్ర యోజన = అనేక వేల యోజనముల; పర = దూరములో నున్న; భానూ = సూర్యుని; లీల్యో = మింగబోయావు; తాహి = దానిని; మధుర ఫల జానూ = మధుర ఫలము అనుకొని
తాత్పర్యము: ఓ హనుమా! నీవు
బాల్యమునందు అనేక వేల యోజనముల దూరములో నున్న సూర్యుని చూసి ఎర్రని మధుర ఫలమనుకొని
మింగబోయావు.
వివరణ: లేల్య ( लेल्य ) అనేది సంస్కృత
పదము. దీని అర్థము దగ్గరగా పట్టి ఉంచుట.
అవధి బాషలో ఇది ‘లీల్యో’ గా రూపాంతరము చెంది ఉండ వచ్చును
19. ప్రభు ముద్రికా మేలి
ముఖ మాహీ(
జలధి లాంఘి
గయే అచరజ నాహీ(
అర్థములు: ప్రభు ముద్రికా =
శ్రీరాముడు గుర్తుగా ఇచ్చిన ముద్రికను; మేలి ముఖ మాహీ( = నోటి యందు ఉంచుకొని; జలధి లాంఘి = సముద్రాన్ని లంఘించి; గయే = (లంకకు) వెళ్లావు; అచరజ నాహీ( = (ఇందులో
ఏమాత్రము) ఆశ్చర్యము లేదు
తాత్పర్యము: శ్రీరాముడు గుర్తుగా
ఇచ్చిన ముద్రికను నోటి యందు ఉంచుకొని సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లావు. ఇందులో ఏమాత్రము ఆశ్చర్యము లేదు.
20. దుర్గమ కాజ జగత
కే జేతే
సుగమ అనుగ్రహ
తుమ్హరే తేతే
అర్థములు: జగత కే
జేతే = జగత్తులోని ఎటువంటి;
దుర్గమ కాజ = అసాధ్య
మైన కార్యములు (అయినా); అనుగ్రహ తుమ్హరే తేతే = అవి నీ అనుగ్రహము వలన; సుగమ = సులువుగా (నెరవేరును).
తాత్పర్యము: ప్రపంచములోని ఎటువంటి
అసాధ్య కార్యములు అయినా, నీ అనుగ్రహము వలన సులభముగా
నెరవేరును
21. రామ దువారే తుమ
రఖవారే
హోత న ఆజ్ఞా
బిను పైసారే
అర్థములు: రామ దువారే = శ్రీరామ చంద్రుని ద్వారానికి; తుమ రఖవారే = నీవే కాపలా; హోత న
ఆజ్ఞా = నీ ఆజ్ఞ లేనిదే; బిను పైసారే = (ఎవరూ లోపలికి ) ప్రవేశించలేరు
తాత్పర్యము: శ్రీరామ చంద్రుని
ద్వారానికి నీవే రక్షకునివి. నీ అనుమతి లేనిదే ఎవరూ లోనికి ప్రవేశించలేరు.
వివరణ: పైసార్
నా
లేదా పైఠానా అంటే చొరబడటము అని అర్థము. హనుమాన్ చాలీసాలో పైసారే బదులు పైఠారే అనే పాఠాంతరము
కూడా ఉన్నది.
వివరణ2: ఆజ్ఞాచక్రములో హనుమంతుడున్నట్లూ, మోక్షస్థానమైన సహస్రారచక్రములో శ్రీరామచంద్రుడున్నట్లూ యోగ పరమైన ఒక రహస్యము గలదు. ఆజ్ఞాచక్రమున స్థితుడైన హనుమంతుని కృపలేనిదే సహస్రారమున గల శ్రీరాముని చేరలేమని ఈ చౌపాయీ యొక్క విశేషార్థము.
వివరణ2: ఆజ్ఞాచక్రములో హనుమంతుడున్నట్లూ, మోక్షస్థానమైన సహస్రారచక్రములో శ్రీరామచంద్రుడున్నట్లూ యోగ పరమైన ఒక రహస్యము గలదు. ఆజ్ఞాచక్రమున స్థితుడైన హనుమంతుని కృపలేనిదే సహస్రారమున గల శ్రీరాముని చేరలేమని ఈ చౌపాయీ యొక్క విశేషార్థము.
22. సబ సుఖ లహై తుమ్హారీ శరనా
తుమ రక్షక కాహూ కో డరనా
అర్థములు: తుమ్హారీ శరనా = నిన్ను శరణు జొచ్చిన వారు; సబ సుఖ లహై = అన్ని సుఖములూ అనుభవిస్తారు; తుమ రక్షక = నీవు
రక్షకుడుగ ఉండగా; కాహూ కో డరనా = (ఇంకా) భయము దేనికి?
తాత్పర్యము: నిన్ను శరణు జొచ్చిన
వారు సర్వ సౌఖ్యములు అనుభవిస్తారు.
నీవే సంరక్షకునిగా వున్నప్పుడు ఇంక భయము దేనికి?
23. ఆపన తేజ సమ్హారో
ఆపై
తీనో( లోక హాంక
తే కాంపై
అర్థములు: ఆపన తేజ = నీ తేజస్సుని, పరాక్రమాన్ని; సమ్హారో ఆపై = నీవే అదుపులో పెట్ట గలవు; తీనో( లోక = మూడు
లోకములు; హాంక తే = నీవు హుం
కరిస్తే; కాంపై = వణుకుతాయి
తాత్పర్యము: నీ తేజస్సుని, పరాక్రమాన్ని నీవు తప్ప మరెవరూ అదుపు చేయలేరు. నీవు హుంకరిస్తే చాలు ! మూడు లోకములు వణుకుతాయి.
24. భూత పిశాచ నికట
నహి(
ఆవై
మహావీర! జబ నామ
సునావై
అర్థములు: భూత పిశాచ = భూత
పిశాచములు; నికట నహి( ఆవై = దగ్గరకు రావు; మహావీర! = ఓ మహావీరా; జబ నామ సునావై = ఎప్పుడైతే నీ పేరు వినిపిస్తుందో
తాత్పర్యము: ఓ మహావీరా
! నిన్ను స్మరిస్తే చాలు
! భూత పిశాచములు దగ్గరకు కూడా రావు.
25. నాశై రోగ హరై
సబ పీరా
జపత నిరంతర
హనుమత వీరా
అర్థములు: జపత నిరంతర హనుమత
వీరా = మహా వీరుడైన హనుమంతుణ్ణి నిరంతరమూ జపిస్తే; నాశై
రోగ = రోగములు నాశన మౌతాయి; హరై సబ పీరా = అన్ని బాధలూ తొలగి పోతాయి;
తాత్పర్యము: మహా వీరుడైన హనుమంతుణ్ణి
నిరంతరమూ జపిస్తే, సర్వ
రోగములు నాశన మౌతాయి. మరియు సకల బాధలూ తొలగి పోతాయి.
26. సంకట సే హనుమాన
ఛుడావై
మన క్రమ
వచన ధ్యాన జో
లావై
అర్థములు: మన క్రమ వచన = మనసు, కర్మ ,
మాటలతో, త్రికరణ శుద్ధిగా (
హనుమంతుని) ; ధ్యాన జో లావై = ఎవరు ధ్యానిస్తారో
వారిని; సంకట
సే = కష్టముల నుండి హనుమాన
ఛుడావై = హనుమంతుడు విడిపిస్తాడు;
తాత్పర్యము: హనుమంతుని త్రికరణ
శుద్ధిగా ఎవరు ధ్యానిస్తారో, వారిని హనుమంతుడే సంకటముల నుండి
విడిపిస్తాడు
27. సబ పర రామ
తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా
అర్థములు: తపస్వీ సబ పర
= తపస్వులు అందరి పైనా; రామ = రాముడు; రాజా = రాజు; తిన
కే కాజ సకల = వారి అన్ని
కార్యములు;
తుమ సాజా = నీవు చక్క బెడతావు
తాత్పర్యము: ఏ తపస్వులు లేదా భక్తులు రాముని మాత్రమే రాజుగా భావించి
కొలుస్తారో,
వారందరి కార్యములు నీవు చక్క బెడతావు
28. ఔర మనోరథ జో కోయి లావై
సోయి అమిత జీవన ఫల పావై
అర్థములు: ఔర మనోరథ = (నీ
భక్తులు) ఇతర మైన కోరికలు; జో కోయి లావై = ఏమి
తీసుకొని వచ్చినా; సోయి = వాటిని;
(మరియు) అమిత = చాలా; జీవన ఫల = ఆయువు,
జీవితానికి చివరి ఫలమైన మోక్షము; పావై = పొందుదురు
తాత్పర్యము: నీ భక్తులు ఇతర మైన ఏ కోరికలతో నిన్ను అర్చించినా, వాటిని నీ దయ వలన సాధించి దీర్ఘాయువు, చివరకు మోక్షమును
పొందుదురు
29. చారో( యుగ ప్రతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా
అర్థములు: చారో( యుగ = నాలుగు యుగముల లోను; ప్రతాప తుమ్హారా = నీ ప్రతాపము; హై పరసిద్ధ
= ప్రసిద్ధమే! (మరియు) జగత ఉజియారా = ప్రపంచాన్ని నీ కీర్తి అనే వెలుగు కాంతి వంతము
చేస్తుంది
తాత్పర్యము: హే హనుమా! నాలుగు యుగముల లోను నీ ప్రతాపము ప్రసిద్ధమే! మరియు ప్రపంచమంతా నీ కీర్తి అనే వెలుగు
వ్యాపిస్తుంది
30. సాధు సంత కే
తుమ రఖవారే
అసుర నికందన! రామ దులారే
అర్థములు: అసుర నికందన! = హే
అసుర సంహారీ; రామ దులారే = రామునికి
ప్రేమపాత్రుడా! ; సాధు సంత కే = సాధువులు,
సన్యాసులకు; తుమ రఖవారే
= నీవే రక్షకుడవు;
తాత్పర్యము: హే అసుర సంహారీ
! రామునికి ప్రియ భక్తుడా
! సాధువులు, సన్యాసులకు నీవే రక్షకుడవు.
31. అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన్హ జానకీ మాతా
అర్థములు: అష్ట సిద్ధి నవ నిధి కే దాతా = అష్ట
సిద్ధులు, నవ నిధులు ఇచ్చే శక్తి నీకు ఉండునని; అస వర = అట్టి
వరాన్ని; జానకీ మాతా = జానకీ
మాత; (నీకు) దీన్హ = ఇచ్చింది;
తాత్పర్యము: సీతా దేవి వరము వలన అష్ట సిద్ధులు, నవ నిధులు నీ భక్తులకు నీవు ఇయ్యగలవు.
32. రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా
అర్థములు: రామ రసాయన = రామ
నామ మనే రసాయనము, సారము, మధుర పదార్ధము; తుమ్హరే పాసా = నీ వద్దనే
ఉన్నది; రఘుపతి
కే దాసా = శ్రీరాముని దాసుడుగా; సదా రహో = ఎప్పటికీ
ఉందువు గాక.
తాత్పర్యము: హే హనుమా! రామ నామ మనే రసాయనము నీ వద్దనే ఉన్నది. నీవెప్పటికీ శ్రీరామ చంద్రుని దాసుడవే!
33. తుమ్హరే భజన రామ కో పావై
జన్మ జన్మ కే దుఃఖ బిసరావై
అర్థములు: తుమ్హరే భజన = నిన్ను
భజించడము ద్వారా; రామ కో పావై = రాముని
పొందవచ్చును (మరియు); జన్మ జన్మ కే = జన్మ జన్మాంతరముల యొక్క;
దుఃఖ బిసరావై = దుఃఖము తొలగి పోవును
తాత్పర్యము: నిన్ను భజించడము ద్వారా రాముని పొందవచ్చును,
మరియు జన్మ జన్మాంతరముల దుఃఖము
తొలగి పోవును
34. అంత కాల రఘుపతి పుర జాయీ
జహా( జన్మ హరి భక్త కహాయీ
అర్థములు: అంత కాల = (నిన్ను
భజించి) అవసాన కాలములో; రఘుపతి పుర జాయీ = (నీ
భక్తులు) రామ సన్నిధిని పొందు తారు; జహా( జన్మ
= అక్కడ (రామ సన్నిధిని చేరి); హరి భక్త కహాయీ = హరి
భక్తులని పిలువబడతారు
తాత్పర్యము: నిన్ను భజించి నీ భక్తులు
అవసాన కాలములో రామ సన్నిధిని పొందు తారు. అక్కడ హరి భక్తులని పిలువబడతారు
35. ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ
అర్థములు: ఔర దేవతా = వేరు
దేవతలను; చిత్త న ధరయీ
= చింతించక పోయినా; హనుమత సేయి = హనుమంతుని
సేవ; సర్వ సుఖ కరయీ = సర్వ
సుఖములను సమకూరుస్తుంది
తాత్పర్యము: వేరు దేవతలను చింతించక
పోయినా ఒక్క హనుమంతుని సేవ సర్వ సుఖములను సమకూరుస్తుంది
36. సంకట కటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత బల వీరా
అర్థములు: బల వీరా = మహా బలుడు మరియు వీరుడైన; జో సుమిరై హనుమత = హనుమంతుణ్ణి ఎవరు స్మరిస్తారో; (అట్టి వారి) సంకట కటై = సంకటములు
తొలగి పోవును; మిటై సబ పీరా = అన్ని బాధలూ
చెరిగి పోవును
తాత్పర్యము: ఎవరు మహా వీరుడైన హనుమంతుణ్ణి స్మరిస్తారో, వారి అన్ని కష్టములు, బాధలు తొలగిపోవును
37. జై జై జై హనుమాన! గోసాయీ!
కృపా కరహు గురుదేవ కీ నాయీ
అర్థములు: గోసాయీ! = సాధు పుంగవుడ వైన; జై జై
జై హనుమాన!
= ఓ హనుమంతుడా ! నీకు జయ మగు గాక; గురుదేవ కీ
నాయీ = గురు దేవుని వలె; కృపా కరహు = (మాపై)
దయ చూపించు;
తాత్పర్యము: ఓ హనుమంతుడా ! సాధు పుంగవుడా! నీకు జయమగు గాక! గురు దేవుని వలె మాపై దయ చూపించుము.
38. జో శత వార పాఠ కర్ కోయీ
ఛూటహి బంది మహాసుఖ హోయీ
అర్థములు: జో శత వార = ఎవరు నూరుసార్లు ( హనుమాన్ చాలీసాను) ; పాఠకర్ కోయీ = చదువుతాడో వాడెవరైనా; ఛూటహి బంది = బంధితుడు
విముక్తుడౌతాడు లేదా (వాని ఐహిక) బంధనములు
నశిస్తాయి; (మరియు) మహాసుఖ
హోయీ = (వానికి) గొప్ప సుఖము కలుగుతుంది
తాత్పర్యము: ఎవరు నూరుసార్లు హనుమాన్
చాలీసాను చదువుతాడో వాడెవరైనా సరే, బంధితుడు బంధన విముక్తుడౌతాడు
మరియు మహాసుఖము పొందుతాడు; (లేదా) ఇహపరమైన బంధనములు తొలగి మోక్షమనే మహా సుఖాన్ని పొందుతాడు
39. జో యహ పఢై హనుమాన్ చాలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీశా
అర్థములు: జో యహ పఢై హనుమాన్ చాలీసా = ఎవరు ఈ హనుమాన్ చాలీసా ను (భక్తితో) పఠిస్తారో (వారికి); సాఖీ
గౌరీశా = (సాఖీ గౌరీ + ఈశా) పార్వతీ
పరమేశ్వరుల సాక్షిగా;
హోయ సిద్ధి = (తప్పక) సిద్ధి లభిస్తుంది, ఫలితము లభిస్తుంది
తాత్పర్యము: ఎవరు ఈ హనుమాన్ చాలీసాను (భక్తితో) పఠిస్తారో వారికి పార్వతీ పరమేశ్వరుల
సాక్షిగా సిద్ధి లభిస్తుంది.
40. తులసీదాస సదా హరి
చేరా
కీజై నాధ! హృదయ మహ డేరా
అర్థములు: తులసీదాస = (ఈ హనుమాన్
చాలీసాను వ్రాసిన తులసీదాసు); సదా = ఎల్లప్పుడూ;
హరి చేరా = హరికి శిష్యుడే; నాధ! =
హే నాధా! శ్రీరామా; హృదయ మహ = నా హృదయాన్ని; డేరా = నీ నివాస స్థానముగా; కీజై = చేసికొనుము;
తాత్పర్యము: ఈ హనుమాన్ చాలీసాను
రచించిన తులసీదాసు ఎల్లప్పుడూ హరికి శిష్యుడే. కనుక హే నాధా! శ్రీరామా! నా
హృదయాన్ని సదా నీ నివాస స్థానముగా చేసికొనుము.
దోహా:
పవనతనయ!
సంకట హరణ! మంగళ
మూరతి రూప్
రామ లఖన సీతా
సహిత హృదయ బసహు
సుర భూప్
అర్థములు: పవనతనయ = హే వాయు
పుత్రా! సంకట హరణ = సంకట హరణా; మంగళ మూరతి రూప్ = హే
మంగళ రూపా ! సుర భూప్ = దేవతలకు రాజైన, విష్ణు స్వరూపుడైన; రామ
లఖన సీతా సహిత = రామ, లక్ష్మణ, సీతా సహితుడవై; హృదయ బసహు = (నా) హృదయములో నివసించుము.
తాత్పర్యము: హే వాయు పుత్రా! సంకట హరణా! దేవతలకు రాజైన, విష్ణు స్వరూపుడైన రాముని తోనూ, సీతా, లక్ష్మణుల తోనూ నా హృదయములో నివసించుము.
రామ లక్ష్మణ జానకీ; జై బోలో హనుమాన్ కీ - శ్రీ రామార్పణమస్తు
హనుమాన్ చాలీసా సమాప్తం
15 January, 2014, మకర సంక్రాంతి
No comments:
Post a Comment