Krishna Satakamu

కృష్ణ శతకము

10 August 2012


కృష్ణ శతకమును శ్రీ నరసింహ శర్మ గారు సుమారు నూరేండ్ల క్రింద వ్రాసిరి.  ఆయన భారద్వాజసగోత్రుడు. ఆయన తల్లి గారి పేరు గంగమాంబ. ఇంతకంటే ఆయన గురించిన వివరములు తెలియ రాలేదు.
ఈ శతకములోని నూరు కంద పద్యములు శ్రీ కృష్ణుని లీలలను వర్ణించుచు, భక్తి తత్వమును ప్రబోధిస్తూ ఆయనచే వ్రాయబడినవి. 



కాని దురదృష్ట వశాత్తూ  మూలప్రతిలో అనేక భాగములు పాడగుటచే  కొన్ని పంక్తులు తెలుగు తెలిసిన కొందరిచే తిరగ వ్రాయబడినవి.   వీరు  పురాణ, ఇతిహాసములతో అంత పరిచయము  ఉన్నవారు  కాక పోవడముతో కొన్నిచోట్ల తప్పులు దొర్లి, అర్థములు కూడా మారినవి. 
ఉదాహరణకు 7 వ పద్యములో  ‘శుక్రార్చిత నన్ను కరుణ జూడుము కృష్ణాఅనే పంక్తి బజారులో దొరికే చాలా పుస్తకాలలో ఉన్నది.  నిజానికి శుక్రార్చితఅనే మాటకు విలువ లేదు. ఎందుకంటే శుక్రుడు విష్ణువును  ఎన్నడూ  అర్చించలేదు. సరికదా, విష్ణువుతో వైరము పెట్టుకొన్నాడు. 
ఇలాంటి తప్పులను మరియు అనేక ప్రక్షిప్తాలను  ఇప్పుడు మంచి తెలుగు పండితులచే జాగ్రత్తగా దిద్దించి, కృష్ణ శతకమును ఈ బ్లాగ్ లో ఉంచడము జరిగినది.  పాఠకులు దీనిని సహృదయముతో గ్రహింపగలరు. 
ఈ బ్లాగ్ లో కృష్ణ శతకమును అచ్చుతప్పులు కూడా లేకుండా తిరగరాయడానికి ప్రయత్నము చేయడము జరిగినది. కొన్ని కఠిన పదాలకు అర్ధములు, అక్కడక్కడ వివరణలు వ్రాయుట జరిగినది. పాఠకులు తప్పులేమైనా గమనించి  నిరూపిస్తే, వాటిని దిద్దడము జరుగుతుంది. 

మొన్న 2012 ఆగష్టు 9 -10 తేదీలలో  కృష్ణాష్టమి నాడు ఈ శతకాన్ని తిరగరాయడం మొదలుపెట్టి,  నా కంప్యూటర్లో ఉంచడము జరిగినది. ప్రారంభించిన కొన్ని దినాలలోనే 100  పద్యాలను పూర్తి చేయగలగడానికి ఆ శ్రీ కృష్ణుని పై భక్తి శ్రద్ధలుమరియు ఆయన కృపయే కారణము.
భక్తి ప్రధాన మైన ఈ శతకాన్ని అందరూ చదివి ఆనందించండి.

1.
శ్రీ రుక్మిణీశ కేశవ ,
నారద సంగీత లోల, నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్దన
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా !
Tough words: నగధర= పర్వతమును ధరించినవాడు

2.
నీవే తల్లివి దండ్రివి,
నీవే నా తోడు నీడ , నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణా
3.
నారాయణ పరమేశ్వర
ధారాధర నీల దేహ , దానవ వైరీ
క్షీరాబ్ధి శయన యదుకుల
వీరా నను గావు కరుణ, వెలయగ కృష్ణా 
Tough words: ధారాధర =మేఘము (నీటిని ధరించునది)
4.
హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహత్యము
హరి హరి పొగడంగ వశమె, హరి శ్రీ కృష్ణా
5.
క్రూరాత్ము- డజామీళుడు
నారాయణ యనుచు నాత్మ నందను పిలువన్
నేరీతి నేలుకొంటివి
ఏరీ నీ సాటి వేల్పు లెందును కృష్ణా
6.
చిలుక నొక  రమణి ముద్దుల
చిలుకను శ్రీరామ! యనుచు శ్రీపతి పేరన్
పిలచిన మోక్షము నిచ్చితి-
వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా
Tough words: అలరగ = సంతోషముతో
7.
అక్రూర వరద, మాధవ!
చక్రాయుధ, ఖడ్గపాణిశార్o, ముకుందా
శక్రాది దివిజ సన్నుత!
శుక్రారీ!  నన్ను కరుణ జూడుము కృష్ణా

Tough words: శార్oగము = విష్ణు మూర్తి ధరించు ధనుస్సు; శక్రాది= ఇంద్రాది;
శుక్రారి = శుక్రుని దండించిన వాడు.
వామనావతారమున  బలిచక్రవర్తి వామనునికి మూడడుగులు దానమిచ్చు చుండగా శుక్రుడు కమండలము కాడకు కీటక రూపములో అడ్డుపడి, జలధార పడకుండా చేసెను. అప్పుడు వామనుడు దర్భ పుల్లతో కాడను కెలికెను. దర్భ గుచ్చుకొని శుక్రుని కన్ను పోయి అతడు బాధతో బయటకు వచ్చెను. అప్పుడు జలధార పడగా బలిచక్రవర్తి తన దాన క్రియను పూర్తిచేసెను.
8.
నందుని ముద్దుల పట్టిని,
మందరగిరి ధరుని, హరుని, మాధవు, విష్ణున్
సుందర రూపుని, మునిజన-
వందితు నిను దలతు భక్తవత్సల కృష్ణా
9.
ఓ కారుణ్య పయోనిధి!
నాకాధారంబు వగుచు నయముగ బ్రోవన్
నాకేల యితర చింతలు ?
నాకాధిప వినుత! లోక నాయక! కృష్ణా
Tough words: నాకాధిప వినుత= స్వర్గాధిపతి ఇంద్రునిచే ప్రార్ధించ బడిన వాడు
10.
వేదంబులు గననేరని
యాది పర బ్రహ్మ మూర్తి వనఘ! మురారీ
నా దిక్కు జూచి కావుము
నీ దిక్కే నమ్మి నాడ నిజముగా కృష్ణా
11.
పదునాలుగు భువనంబులు
కుదురుగ నీ కుక్షి నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా
12
అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమున బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె,
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా
Tough words= సృష్టి = ప్రపంచమును; ప్రతిపాలనంబు = చక్కని పాలన
13.
అల్ల జగన్నాధుకు వ్రే -
పల్లియ క్రీడార్ధమయ్యె, పరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయు 
తల్లియునై చన్ను గుడిపె, దనరగ కృష్ణా
14.
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి, యా గోపిక
ముందర నాడుదువు, మిగుల మురియుచు కృష్ణా
15.
హరి చందనంబు మేనున
కర మొప్పెడు హస్తములును, కంకణ రవముల్
ఉరమున రత్నము మెరయగ
బరగితివౌ నీవు బాల ప్రాయము కృష్ణా
Tough words: కర మొప్పెడు= అందమైన; ఉరమున= వక్ష స్థలమున   ;
పరగితివి= ఒప్పితివి, ఉంటివి     
16.
పాణీ తలమున వెన్నయు
వేణీ మూలంబునందు వెలయగ పింఛం-
బాణీ ముత్యము ముక్కున
జాణవు నై దాల్చు శేష శాయివి కృష్ణా
Tough words: పాణీ తలము= అరచేయి; వేణీ మూలము= జుట్టు కొప్పు
17.
మడుగుకు జని కాళీయుని
పడగలపై భరత శాస్త్ర పధ్ధతి వెలయన్
కడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలతు నచ్యుత కృష్ణా
18.
బృందావనమున బ్రహ్మా-
నందార్భక మూర్తి వేణునాదము నీవా
మందార మూలమున గో-
విందా పూరింతు వౌర వేడుక కృష్ణా
19.
వారిజ నేత్రులు యమునా
వారిని జలకంబులాడ వచ్చిన నీవా
చీరలు మ్రుచ్చిలి తెచ్చితి
నేరుపుగా యదియు నీకు నీతియె కృష్ణా
Tough words: యమునా వారిని= యమునా నది నీటిలో; మ్రుచ్చిలి= దొంగిలించి 
20.
దేవేంద్రుడలుక తోడను
వావిరిగా రాళ్ళ వాన వడి గురియింపన్
గోవర్ధన గిరి ఎత్తితి
గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా
Tough words: వావిరిగా= మిక్కిలిగా
21.
అండజ వాహన విను  బ్ర -
హ్మాండంబులు బంతులట్లు యాడెడు నీవా
కొండల నెత్తితి వందురు
కొండిక పని గాక దొడ్డ కొండా కృష్ణా
Tough words: అండజము =పక్షి, గరుత్మంతుడు; కొండిక = తుంటరి 
22.
అంసాలంబిత కుండల
కంసాంతక నీవు ద్వారకా పురి లోనన్ 
సంసారి రీతి నుండి ప్ర-
శంసార్హుడ వైతి, వహహ! జగతిని కృష్ణా
Tough words: అంసాలంబిత కుండలములు = భుజముల వరకు వ్రేలాడు చెవి పోగులు
23.
పదియారువేల నూర్వురు
సుదతులు  నెనమండ్రు  నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహు రూపుల
వదలక భోగింతు వౌర వసుధను కృష్ణా
Tough words= బహు రూపుల వదలక భోగింతువు = అందరి వద్ద అన్ని రూపులలో నుండి సుఖము నిచ్చెదవు
24.
అంగన పనుపున ధోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయ నొసగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా
Tough words: అంగన పనుపున = భార్య పంపగా ( కుచేలుడు )
25.
హా! వసుదేవ కుమారక!
కావుము నా మానమనుచు కామిని వేడన్
నా వనజాక్షికి నిచ్చితి
శ్రీవర! యక్షయ మటంచు చీరలు కృష్ణా
26.
శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకషమగుచు మ్రోవ, నాహవ భూమిన్
విభ్రములగు రాక్షస జన 
గర్భంబులు పగులజేయు ఘనుడవు కృష్ణా
Tough words: అభ్రంకషమగుచు= ఆకాశమును తాకునట్టి (శబ్దము) చేయుచు;
ఆహవ భూమి= యుద్ధ భూమి; విభ్రములగు= భయపడినట్టి
27.
జయమును విజయున కియ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున నొప్పవె  తేరున
భయమున రిపుసేన విరిగి పారగ కృష్ణా
Tough words: ములుకోల మోపి= కొరడాతో అదలించి; విరిగి పారగ= చెల్లా చెదురై పోవగా
28.
దుర్జనులగు నృపసంఘము
నిర్జించితి పరశురాము నవతారమునన్ 
దుర్జనులను వధియింపను
నర్జును రథ చోదకుండ వైతివి కృష్ణా 
29.
శక్రసుతు గాచు కొరకై
చక్రము చేపట్టి భీష్ము జంపగ చను నీ
విక్రమ మేమని పొగడను!
నక్రగ్రహ, సర్వలోక నాయక కృష్ణా
Tough words:  శక్ర సుతుడు = ఇంద్ర పుత్రుడు, అర్జునుడు
నక్ర =  మొసలి;   గ్రహ = నిర్మూలించిన వాడు
30.
దివిజేంద్ర సుతుని జంపియు
రవిసుతు రక్షించినావు రఘు రాముడవై
దివిజేంద్ర సుతుని గాచియు
రవిసుతు బరిమార్చి తౌర  రణమున కృష్ణా
31.
దుర్భర బాణము రాగా
గర్భములో నుండి యభవ గావు!’  మటన్నన్
నిర్భర కృప రక్షించితి-
వర్భకు నభిమన్యు  సుతుని నచ్యుత కృష్ణా
32.
గిరులందు మేరువౌదువు
సురలందున నింద్రుడౌదు, చుక్కలలోనన్ 
బరమాత్మ! చంద్రుడౌదువు
నరులందున నృపతి వౌదు, నయమున కృష్ణా   
33.
చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
జొక్కపు నీ గుణ జాలము
నక్కజమగు లెక్కపెట్ట, నజునకు కృష్ణా 
Tough words:  చొక్కపు=అందమైన
అక్కజమగు= ఆశ్చర్యమగు; అజునకు= బ్రహ్మకు
34.
కుక్షిని నఖిల జగంబులు
నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక! వట పత్రముపై
దక్షత పవళించు నట్టి, ధన్యుడ కృష్ణా 
35.
విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింప దలచి విష్ణుడవనగా
విశ్వము జెరుపను హరుడవు
విశ్వాత్మక నీవె యగుచు వెలయగ కృష్ణా
36.
అగణిత వైభవ! కేశవ!
నగధర! వనమాలి! యాది నారాయణ! యో
భగవంతుడ! శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు నీకు శరణము కృష్ణా
Tough words: అగణిత= లెక్కింప రాని
37.
మగ మీనమవై జలనిధి
పగతుని సోమకుని చంపి పద్మభవునకున్
నిగమములు తెచ్చి యిచ్చితి
సుగుణాకర మమ్ము గరుణ చూడుము కృష్ణా
Tough words: పగతుని= శత్రువైన; నిగమములు= వేదములు
38.
అందరు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధి దరువ, పొలుపున నీవా-
నందముగ కూర్మ రూపున
మందరగిరి ఎత్తి తౌర మాధవ కృష్ణా

Tough words: తరువన్ = చిలకగా ; పొలుపున = చక్కగా
39.
ఆది వరాహుండయి నీ
వా దనుజు హిరణ్యనేత్రు, హతుజేసి తగన్,
మోదమున సురలు పొగడగ
మేదిని కిటి ముట్టి కెత్తిమెరసితి కృష్ణా

Tough words: హిరణ్యనేత్రుడు = హిరణ్యాక్షుడు;  మేదిని= భూమిని కిటి ముట్టి కెత్తి = వరాహ రూపుడవైన నీ మూతి కోరల పై నెత్తి;  (కిటి= వరాహము)
40.
కెరలి యరచేత కంబము
సరుదుగ చేయుటను వెడలి, యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార నగధర కృష్ణా

Tough words: కెరలి= విజృంభించి; సరుదుగ చేయుటను = గట్టిగా చరచగా
41.
వడుగవు వై  మూడడుగుల
నడిగితి వౌ బలిని భళిర! యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణా

 Tough words:  వడుగవు వై = వటువు వై, వామనుడ వై
42.
ఇరువదొక మార్లు నృపతుల
శిరముల ఖండిచి తౌర! చేగొడ్డంటన్ 
ధర కశ్యపునకు నిచ్చియు
బరగవె! జమదగ్ని రామభద్రుడ! కృష్ణా

Tough words: చేగొడ్డంటన్ = చేతి గొడ్డలిచే;    పరగవే = ఒప్పవే
జమదగ్ని రామభద్రుడు = పరశు రాముడు
43.
దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చు కొనియు నయోధ్యన్
విశదముగ కీర్తి నేలిన
దశరధ రామావతార! ధన్యుడ! కృష్ణా
44.
ఘనులగు ధేనుక ముష్ఠిక
దనుజుల జెండాడి తౌర! తగు భుజ శక్తిన్
అనఘాత్మ! రేవతీపతి
వనగా బలరామ మూర్తి వౌగద కృష్ణా 
45.
త్రిపురాసుర భార్యల నతి
నిపుణత తో వ్రతము చెరిపి నిలిపితి కీర్తుల్
కృపగల రాజువు భళిరే!
కపటపు బౌద్ధావతార! ఘనుడవు కృష్ణా
Commentary: త్రిపురాసురులు తమ భార్యల పూజా నియమముల చేత, వారి జ్ఞానము చేత, వారి పాతివ్రత్యము చేత అత్యంత శక్తిమంతులై లోకములను హింసింప సాగిరి.  అపుడు విష్ణుమూర్తి కపట బుద్ధావతారము నెత్తి దిగంబరుడై  ఆ భార్యలకు శూన్య వాదము బోధించి, వారిని ఒప్పించి, వారి జ్ఞానము నశింప జేసెను. అంతట  వారు పూజాదికాలు మానిరి. దానితో త్రిపురాసురుల శక్తి నశించెను.  పిమ్మట   త్రిపురాసురులను శివుడు సంహరించెను. ఇది బుద్ధావతార కథ.
కృపగల రాజువు = మరల కలియుగములో త్రిపురాసురులు   శుద్ధోదనుడను రాజుగా జన్మించిరి. శుద్ధోదనుడు తపస్సుతో జ్ఞానము సంపాదించెను. అతని జ్ఞానమే అతని శక్తి.   కానీ అతని పూర్వ దుష్ట గుణములు పోవయ్యెను.   అందువలన అతడు తిరిగి విజృంభించకుండా  అతని జ్ఞానమును చెరుపవలసి వచ్చెను.
అపుడు విష్ణువు అతని కొడుకు సిద్ధార్ధునికి వైరాగ్యము పుట్టించి ఇంటినుండి వెడలిపోవునట్లు చేసెను. మరియు బోధి వృక్షము క్రింద  సిద్ధార్ధునికి కపట జ్ఞానము లేదా శూన్య వాదమును స్ఫురింప జేసెను.
తరువాత  సిద్ధార్ధుడు శుద్ధోదనుని వద్దకు వచ్చి అతనికి కపట జ్ఞానము లేదా శూన్య వాదమును బోధించి అతని జ్ఞానమును నశింప జేసెను. మరియు అతనిని తన శిష్యునిగా స్వీకరించి నిర్వీర్యుని చేసెను.  సిద్ధార్ధుడే కృపగల రాజు.
46.
వెలిపపు  తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప, హీనుల ద్రుంపన్
కలియుగము తుదిని  వేడుక
కలికివి గానున్న లోక కర్తవు కృష్ణా

Tough words:  వెలిపపు = తెల్లని ; తేజీ = గుఱ్ఱము
47.
వనజాక్ష! భక్తవత్సల!
ఘనులగు త్రైమూర్తులందు కరుణా నిధివై
కన, నీ సద్గుణ జాలము
సనకాది మునీంద్రు లెన్న జాలరు కృష్ణా

Tough words:  కన = చూడగా
48.
అపరాధ సహస్రంబుల
నపరిమితము లైన యఘము లనిశము నేనున్
గపటాత్ముడనై జేసితి
చపలుని నను గావు శేషశాయివి కృష్ణా

Tough words: అఘములు = పాపములు;  అనిశము= ఎల్లప్పుడు
49.
నరపశుడ మూఢచిత్తుడ
దురితారంభుడను మిగుల దోషగుడను నీ
గురుతెరుగ నెంత వాడను
హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా

Tough words: నీ  గురుతెరుగ = నిన్ను తెలుసుకొన;   ప్రాపు దాపు= అండదండ
50.
పరనారీ ముఖపద్మము
గురుతుగా నొయ్యారి  నడక గొప్పును నడుమున్
అరయంగనె  మోహింతురు 
నిరతము నిను భక్తీ గొల్వ నేర్వరు కృష్ణా

Tough words:  అరయంగనె= చూడగనే
51.
పంచేంద్రియ మార్గంబుల
గొంచెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచుక మిమ్మెరిగినాడ నిప్పుడె  కృష్ణా

Tough words:  కొంచెపు బుద్ధిని = స్వల్ప బుద్ధితో ;
సజ్జన సంగతి ఎంచుక  = సజ్జన సాంగత్యము  ఎన్నుకొని (చేసికొని)
52.
దుష్టుండ దురాచారుడ
దుష్ట చరిత్రుడను  చాల దుర్బుద్ధిని నే
నిష్ఠ నిను గొల్వనేరను
ఇష్టముతో  నన్ను  గావు నిలలో కృష్ణా
53.
కుంభీంద్ర వరద!  కేశవ!
జంభాసుర వైరిదివిజ సన్నుత చరితా!
అంభోజనేత్ర! జలనిధి 
గంభీరా నన్ను గావు కరుణను కృష్ణా

Tough words:  కుంభీంద్ర వరద = గజేంద్రుని కాపాడిన వాడా,
దివిజ సన్నుత చరితా= దేవతలచే పొగడబడిన చరిత్రము గలవాడా
జలనిధి గంభీరా = సముద్రము వంటి గాంభీర్యము గలవాడా
54.
దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండవులకు, దీనుల కెపుడున్
దిక్కెవ్వర- య్యహల్యకు 
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా

Tough words:  అ- య్యహల్యకు = ఆ + అహల్యకు
55.
హరి నీవె దిక్కు! నా కన
సిరితో నేతెంచి మకరి శిక్షించి తగన్
పరమేష్ఠి  సురలు పొగడగ
కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా
          
Tough words:  నా కన = నాకు + అన ; మకరి = మొసలి
56.
పురుషోత్తమ! లక్ష్మీపతి!
సరసిజ గర్భాది మౌని సన్నుత చరితా
మురభంజన! సురరంజన!
వరదుడవగు, నాకు భక్త వత్సల కృష్ణా

Tough words:  సరసిజ గర్భాది = బ్రహ్మఇత్యాది వరదుడవగు= వరము లిచ్చే వాడవు కమ్ము
57.
క్రతువులు తీర్థాగమములు
వ్రతములు దానములు జేయ వలెనా? లక్ష్మీ-
పతి! మిము దలచిన వారికి
నతులిత పుణ్యములు గలుగుటరుదా?  కృష్ణా
58.
స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని నన్నున్
కుంభీంద్ర వరద కేశవ !
రంభాధిప వినుత! గావు  రక్షక  కృష్ణా

Tough words:  కుంభీంద్రుడు = గజేంద్రుడు ;
రంభాధిప వినుత = దేవేంద్రునిచే పొగడబడిన వాడా 
59.
శతకోటి భానుతేజా
అతులిత సద్గుణ గుణాఢ్య! యంబుజనాభా
రతినాధ జనక! లక్ష్మీ
పతి! హిత! నను గావు భక్త వత్సల కృష్ణా

Tough words:  రతినాధ జనక = మన్మథుని తండ్రి ( రతినాధుడు= మన్మథుడు )
హిత= మంచి చేయువాడు
60.
మందుడ, నే దురితాత్ముడ
నిందల కొడిగట్టి నట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా

Tough words: మందుడ= తెలివి హీనుడను
61.
గజరాజ వరద కేశవ
త్రిజగత్కల్యాణ మూర్తి! దేవ మురారీ
భుజగేంద్ర శయన మాధవ
విజయాప్తుడ  నన్ను గావు వేడుక కృష్ణా

Tough words:  విజయాప్తుడు = అర్జునినికి దగ్గర వాడు
62.
గోపాల! దొంగ! మురహర!
పాపాలను పారద్రోలు ప్రభుడవు నీవే
నీ పాదములను నమ్మితి
నా పాలిట దయను జూపు నయమున కృష్ణా 
63.
దుర్మతిని మిగుల దుష్టపు
కర్మంబులు జేసినట్టి కష్టుని నన్నున్
నిర్మలుని జేయవలె, ని-
ష్కర్ముడ! నిను నమ్మినాను గావుము కృష్ణా

Tough words:  కష్టుని= దుష్టుని, కష్టములనుభవించిన వానిని;
నిష్కర్ముడ! = కర్మలు అంటని ఓ కృష్ణా! 
64.
దుర్వార చక్రధర! హరి!
శర్వాణీ ప్రముఖ వినుత! జగదాధారా!
నిర్వాణ నాధ! మాధవ !
సర్వాత్మక నన్ను గావు సరగున కృష్ణా

Tough words:  శర్వాణీ ప్రముఖ వినుత = పార్వతి ఇత్యాది ప్రముఖులచే పొగడబడిన వాడా
సరగున= వేగమే
65.
సుత్రామనుత! జనార్దన!
సత్రాజిత్తనయ నాధ! సౌందర్య కళా
చిత్రావతార! దేవకి పుత్రా
నను గావు నీకు పుణ్యము కృష్ణా

Tough words:  సుత్రామనుత= ఇంద్రునిచే స్తుతింప బడిన వాడా!
సత్రాజిత్+ తనయ= సత్యభామ
సౌందర్య కళాచిత్రావతార= సుందర కళా చిత్రము వంటి రూపము గలవాడా
66.
బలమెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు రవిసుతునకు
బలమెవ్వడు నాకు నీవు బలమౌ కృష్ణా

Tough words:  రవిసుతుడు = సుగ్రీవుడు
67.
పరుసము సోకిన ఇనుమును
వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి! నీ నామము సోకిన
సురవందిత నేను నటుల,  సులభుడ కృష్ణా

Tough words:  పరుసము= ఇనుమును బంగారము చేయు ఒక మూలిక;
వడుపున= మాదిరిగాజిహ్వ= నాలుక
నేను నటుల= నేనున్+ అటుల
68.
ఒకసారి  నీదు  నామము
ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్
వికలములై తొలగుటకును
సకలార్ధా! సాక్షి యజామీళుడు కృష్ణా

Tough words:  ప్రకటముగా = పైకి వినిపించునట్లు, గట్టిగా; వికలములై = విరిగినవై
సకలార్ధా = సకలమైన పురుషార్ధములు (కోరికలు) ఇచ్చువాడు 
69.
హరి యంతయు గలడా? యని
గరిమను దైత్యుండు బలుక, కంబము లోనన్
ఇరవొంద వెడలి చీల్చవె
శరణను ప్రహ్లాదకుండు సాక్షిగ కృష్ణా

Tough words:  గరిమను= గొప్పగా;   దైత్యుండు= హిరణ్యకశిపుడు;
ఇరవొంద = ఇరవు+ పొంద ; ఇరవు = స్థానముఅనగా స్తంభమును స్థానముగా చేసికొని
70.
భద్రార్చిత పదపద్మ!  సు-
భద్రాగ్రజ సర్వలోక పాలక!  హరి! శ్రీ- 
భద్రాధిప! కేశవ! బల-
భద్రానుజ! నన్ను బ్రోవు భవహర కృష్ణా

Tough words:  భద్రార్చిత = 'భద్రఅను భార్యచే  అర్చింపబడు వాడు;
శ్రీ భద్రాధిపుడు  = భద్రాద్రికి పాలకుడైన శ్రీరాముడు
బలభద్రానుజుడు= బలరామునికి తమ్ముడు 
71.
ఎటువలె కరిమొర వింటివి
ఎటువలె ప్రహ్లాదు కభయ మిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట! నిను నమ్మినాడ గావుము కృష్ణా

Tough words:  కటకట! నిను నమ్మినాడ = అయ్యయ్యో ! నిన్నే నమ్మినానే !
72.
తటతట లేటికి జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటా కర్ణున్
ఎటువలె నిపుణుని జేసితి-
వటువలె రక్షింపు మయ్య అచ్యుత కృష్ణా

Tough words:  తటతటలు = మోసములుసయ్యాటలు;  ఘంటాకర్ణున్ = ఘంటాకర్ణుడను పిశాచ రాజును 
ఎటువలె నిపుణుని జేసితి= ఏవిధముగా మోక్షార్హుని చేసి మోక్ష మిచ్చితివో
73.
తురగాధ్వరమును  జేసిన
పురుషులకును వేరు, యిలను పుట్టుట ఏమో
హరి మిము దలచిన వారికి
యరుదా? కైవల్య పదవి యచ్యుత కృష్ణా

తురగాధ్వరము = అశ్వమేధ యాగము
వేరు యిలను పుట్టుట ఏమో = మరొకసారి భూమిపై జన్మించుట ఉండకపోవచ్చును
కైవల్య పదవి= మోక్షము
74.
ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ! మురారి యో రఘురామా!
ఓ భక్త కామధేనువ!
ఓ భవహర నన్నుగావు యో హరి కృష్ణా
75.
ఏ తండ్రి, కనక కశ్యపు
ఘాతకుడై యతని సుతుని కరుణను గాచెన్
ప్రీతి సురకోటి పొగడగ
నా తండ్రీ నిన్ను నేను నమ్మితి కృష్ణా

Tough words:  ఏ తండ్రి = ఏ విష్ణువు;  
కనక కశ్యపు ఘాతకుడై = హిరణ్యకశిపుని చంపి 
76.
ఓ పుండరీక లోచన
ఓ పురుషోత్తమ!  ముకుందఓ గోవిందా!
ఓ పురధ్వంసక మిత్రుడ!
ఓ పుణ్యుడ నన్ను బ్రోవుమో హరి కృష్ణా

Tough words:  పురధ్వంసక మిత్రుడు = త్రిపురాసురులను సంహరించిన
శివునికి మిత్రుడు
77.
ఏ విభుడు ఘోర రణమున
రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు-
నావిభు, నే మదిని దలతు నచ్యుత కృష్ణా
78.
గ్రహ భయ దోషము పొందరు
బహు పీడలు చేర వెరచు పోవును నఘముల్
ఇహపర ఫలదాయక! విను
తహతహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా

Tough words:  అఘములు= పాపములు తహతహలు= కోరికలు
79.
గంగ మొదలైన నదులను
మంగళముగ  జేయునట్టి మజ్జనములకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలపసాటి రావుర! కృష్ణా

Tough words:  మంగళముగ  జేయునట్టి మజ్జనములకున్ =చేసే మంగళ స్నానములకు
సంగతి గలిగిన ఫలములు= సత్సంగ ఫలములు;
రంగుగ మిము దలప = చక్కగా నిన్ను తలచిన ఫలముతో
80.
  దండకా వనంబున
కోదండము  దాల్చినట్టి  కోమల మూర్తీ!
నాదండ గాగ  రమ్మీ
వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా

Tough words:  నాదండ గాగ రమ్మీ= నా యొక్క అండ యగుటకు రమ్ము!
వేదండము = ఏనుగు
81.
చూపుము నీ రూపంబును
పాపపు దుష్కృతము లెల్ల పంకజ నాభా!
బాపుము సాకుము దయతో
శ్రీపతి! నిను నమ్మినాడ సిద్ధము  కృష్ణా

Tough words:  సిద్ధము= నిజము
82.
నీ నామము భవహరమగు
నీ నామము సర్వ సౌఖ్య నివహ కరంబున్
నీ నామమమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యుడ! కృష్ణా

Tough words:  నివహ కరము = తెచ్చునది, కలిగించునది
83.
పరులను నడిగిన జనులకు
కురుచ సుమీ, యిది యటంచు తెలిసియు నీవున్
కురుచడ వై యడిగితి మును
ధర పాదత్రయము బలిని తద్దయు కృష్ణా

Tough words:  కురుచ సుమీ, యిది యటంచు = అట్లడుగుట పరువు తక్కువని ; కురుచడు= వామనుడు
84.
పాలును వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లి గట్ట రోషము తోడన్
లీలావినోది వైతివి
బాలుడవా? బ్రహ్మ గన్న ప్రభుడవు కృష్ణా
85.
రఘునాయక!  నీ నామము
లఘుమతితో తలపగానె, లక్ష్మీ రమణా
అఘములు బాపుము దయతో
రఘురాముడ! సకలలోక రక్షక కృష్ణా

Tough words:  లఘుమతితో = స్వల్ప బుద్ధితో నైనను;  అఘములు = పాపములు 
86.
అప్పా! యిచ్చితి వందురు
నప్పాలను నతిరసంబు అనుభవ శాలీ
యప్పా!  నను గనుగొనవే
యప్పా నను బ్రోవు వేంకటప్పా! కృష్ణా

Tough words:  అప్పా= అయ్యా, తండ్రీఅప్పాలను, నతిరసంబు = ఆ పాలను, మధుర పదార్థములను  (నీ సఖులకు)
87.
కొంచపు వాడని మదిలో
నెంచకుమీ వాసుదేవ !  గోవింద హరీ !
అంచితముగ నీ కరుణకు
కొంచము నధికంబు గలదె?  కొలవిడ కృష్ణా

Tough words:  అంచితముగ = తగినట్లు చూడగా  ; కొలవిడ = కొలవగా 
88.
వావిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గు చేయు గర్వాంధులకున్
దేవ! వధించుట వింటిని
నీవల్లను భాగ్య మయ్యె, నిజముగ కృష్ణా

Tough words:  వావిరి= వరుసగా, అనేకమార్లుఎగ్గు = కీడు
89.
అయ్యో పంచేంద్రియములు
నుయ్యాలల నూపినట్టు  లూపగ నేనున్ 
చయ్యన గలగుచు నుంటిని
కుయ్యాలింపుము మహాత్మ! గోపతి కృష్ణా

Tough words: చయ్యన = వెంటనే ; కలగుచు నుంటిని = కలత పడుచుంటినికుయ్య + ఆలింపుము = మొర వినుము
90.
కంటికి రెప్ప విధంబున
బంటుగదా యనుచు నన్ను బాయక నెపుడున్
జంటను నీవుండుటచే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా
91.
యమునికి నిక నే వెరువను
కమలాక్ష జగన్నివాస! కామిత ఫలదా
విమలమగు నీదు నామము
నమరగ దలచెదను వేగ ననిశము కృష్ణా

Tough words:  అమరగ= ఒప్పుగా, చక్కగా
అనిశము= ఎల్లప్పుడు
92.
దండమయా విశ్వంభర!
దండమయా పుండరీక దళ నేత్ర హరీ
దండమయా కరుణా నిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా

Tough words:  విశ్వంభర = లోకములను భరించిన వాడా !
93.
నారాయణ లక్ష్మీపతి!
నారాయణ వాసుదేవ! నంద కుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర! కృష్ణా
94.
తిరుమణి దురిత విదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగంబందున్
తిరుమణి బెట్టిన మనుజుడు
పరమ పవిత్రుండు భాగ్య వంతుడు కృష్ణా

Tough words:  తిరుమణి = శ్రీ చూర్ణము, కస్తూరి తిలకము
95.
శ్రీలక్ష్మీ నారాయణ
వాలాయము నిన్ను దలతు వందిత చరణా
ఏలుము నను నీ బంటుగ
చాలగ నిను నమ్మినాను సరసుడ కృష్ణా

Tough words:  వాలాయము = తప్పక ; నిరంతరముచాలగ = మిక్కిలిగా
96.
శ్రీధర! మాధవ! యచ్యుత
భూధర! పురుహూత వినుత! పురుషోత్తమ! నీ
పాద యుగళ మెప్పుడు నే
మోదముతో నమ్మినాడ, ముద్దుల కృష్ణా

Tough words:  పురుహూతుడు= ఇంద్రుడు
97.
శిరమున రత్న కిరీటము
కరయుగమున శంఖ చక్ర ఘన భూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సిరినాయక యమర వినుత,  శ్రీహరి కృష్ణా 
98.
అందెలు పాదములందున
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర ముని సన్నుత
నందుని వరపుత్ర, నిన్ను నమ్మితి కృష్ణా 
99.
కందర్పకోటి సుందర
మందరధర భానుతేజ మధుసూదన! యో
సుందర విగ్రహ మునిజన
వందిత మిము దలతు భక్త వత్సల కృష్ణా

Tough words:  కందర్పకోటి = కోటి మన్మధులు
100.
అనుదినము కృష్ణ శతకము
వినిన పఠించినను ముక్తి వేడుక గల్గున్
ధనధాన్యము గోగణములు
తనయులు అభివృద్ధి నొందు తద్దయు కృష్ణా

Tough words:  తద్దయు = మిగుల, అనేకముగా
101.
భారద్వాజ సగోత్రుడ
గారవమున గంగమాంబ కరుణా సుతుడన్
పేరు నృసింహా హ్వయుడను
శ్రీరమణా! నన్ను గావు సృష్టిని కృష్ణా

Tough words:  సృష్టిని = భూమిపై 



No comments: