Sunday, September 16, 2012

Krishna Satakamu - కృష్ణ శతకము - Poems 96-101


96.
శ్రీధర! మాధవ! యచ్యుత
భూధర! పురుహూత వినుత! పురుషోత్తమ! నీ
పాద యుగళ మెప్పుడు నే
మోదముతో నమ్మినాడ, ముద్దుల కృష్ణా

Tough words:  పురుహూతుడు= ఇంద్రుడు
97.
శిరమున రత్న కిరీటము
కరయుగమున శంఖ చక్ర ఘన భూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సిరినాయక యమర వినుత,  శ్రీహరి కృష్ణా 
98.
అందెలు పాదములందున
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర ముని సన్నుత
నందుని వరపుత్ర, నిన్ను నమ్మితి కృష్ణా 
99.
కందర్పకోటి సుందర
మందరధర భానుతేజ మధుసూదన! యో
సుందర విగ్రహ మునిజన
వందిత మిము దలతు భక్త వత్సల కృష్ణా

Tough words:  కందర్పకోటి = కోటి మన్మధులు
100.
అనుదినము కృష్ణ శతకము
వినిన పఠించినను ముక్తి వేడుక గల్గున్
ధనధాన్యము గోగణములు
తనయులు అభివృద్ధి నొందు తద్దయు కృష్ణా

Tough words:  తద్దయు = మిగుల, అనేకముగా
101.
భారద్వాజ సగోత్రుడ
గారవమున గంగమాంబ కరుణా సుతుడన్
పేరు నృసింహా హ్వయుడను
శ్రీరమణా! నన్ను గావు సృష్టిని కృష్ణా

Tough words:  సృష్టిని = భూమిపై 

Krishna Satakamu - కృష్ణ శతకము - Poems 91-95


91.
యమునికి నిక నే వెరువను
కమలాక్ష జగన్నివాస! కామిత ఫలదా
విమలమగు నీదు నామము
నమరగ దలచెదను వేగ ననిశము కృష్ణా

Tough words:  అమరగ= ఒప్పుగా, చక్కగా
అనిశము= ఎల్లప్పుడు
92.
దండమయా విశ్వంభర!
దండమయా పుండరీక దళ నేత్ర హరీ
దండమయా కరుణా నిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా

Tough words:  విశ్వంభర = లోకములను భరించిన వాడా !
93.
నారాయణ లక్ష్మీపతి!
నారాయణ వాసుదేవ! నంద కుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర! కృష్ణా
94.
తిరుమణి దురిత విదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగంబందున్
తిరుమణి బెట్టిన మనుజుడు
పరమ పవిత్రుండు భాగ్య వంతుడు కృష్ణా

Tough words:  తిరుమణి = శ్రీ చూర్ణము, కస్తూరి తిలకము
95.
శ్రీలక్ష్మీ నారాయణ
వాలాయము నిన్ను దలతు వందిత చరణా
ఏలుము నను నీ బంటుగ
చాలగ నిను నమ్మినాను సరసుడ కృష్ణా

Tough words:  వాలాయము = తప్పక ; నిరంతరము;  చాలగ = మిక్కిలిగా

Monday, September 10, 2012

Krishna Satakamu - కృష్ణ శతకము - Poems 86-90


86.
అప్పా! యిచ్చితి వందురు
నప్పాలను నతిరసంబు అనుభవ శాలీ
యప్పా!  నను గనుగొనవే
యప్పా నను బ్రోవు వేంకటప్పా! కృష్ణా

Tough words:  అప్పా= అయ్యా, తండ్రీ;  అప్పాలను, నతిరసంబు = ఆ పాలను, మధుర పదార్థములను  (నీ సఖులకు)
87.
కొంచపు వాడని మదిలో
నెంచకుమీ వాసుదేవ !  గోవింద హరీ !
అంచితముగ నీ కరుణకు
కొంచము నధికంబు గలదె?  కొలవిడ కృష్ణా

Tough words:  అంచితముగ = తగినట్లు చూడగా  ; కొలవిడ = కొలవగా 
88.
వావిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గు చేయు గర్వాంధులకున్
దేవ! వధించుట వింటిని
నీవల్లను భాగ్య మయ్యె, నిజముగ కృష్ణా

Tough words:  వావిరి= వరుసగా, అనేకమార్లు;  ఎగ్గు = కీడు
89.
అయ్యో పంచేంద్రియములు
నుయ్యాలల నూపినట్టు  లూపగ నేనున్ 
చయ్యన గలగుచు నుంటిని
కుయ్యాలింపుము మహాత్మ! గోపతి కృష్ణా

Tough words: చయ్యన = వెంటనే ; కలగుచు నుంటిని = కలత పడుచుంటిని;  కుయ్య + ఆలింపుము = మొర వినుము
90.
కంటికి రెప్ప విధంబున
బంటుగదా యనుచు నన్ను బాయక నెపుడున్
జంటను నీవుండుటచే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా

Krishna Satakamu - కృష్ణ శతకము - Poems 81-85


81.
చూపుము నీ రూపంబును
పాపపు దుష్కృతము లెల్ల పంకజ నాభా!
బాపుము సాకుము దయతో
శ్రీపతి! నిను నమ్మినాడ సిద్ధము  కృష్ణా

Tough words:  సిద్ధము= నిజము
82.
నీ నామము భవహరమగు
నీ నామము సర్వ సౌఖ్య నివహ కరంబున్
నీ నామమమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యుడ! కృష్ణా

Tough words:  నివహ కరము = తెచ్చునది, కలిగించునది
83.
పరులను నడిగిన జనులకు
కురుచ సుమీ, యిది యటంచు తెలిసియు నీవున్
కురుచడ వై యడిగితి మును
ధర పాదత్రయము బలిని తద్దయు కృష్ణా

Tough words:  కురుచ సుమీ, యిది యటంచు = అట్లడుగుట పరువు తక్కువని ; కురుచడు= వామనుడు
84.
పాలును వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లి గట్ట రోషము తోడన్
లీలావినోది వైతివి
బాలుడవా? బ్రహ్మ గన్న ప్రభుడవు కృష్ణా
85.
రఘునాయక!  నీ నామము
లఘుమతితో తలపగానె, లక్ష్మీ రమణా
అఘములు బాపుము దయతో
రఘురాముడ! సకలలోక రక్షక కృష్ణా

Tough words:  లఘుమతితో = స్వల్ప బుద్ధితో నైనను;  అఘములు = పాపములు