Monday, August 20, 2012

Krishna Satakamu - కృష్ణ శతకము - Introduction


10 August 2012


కృష్ణ శతకమును శ్రీ నరసింహ శర్మ గారు సుమారు నూరేండ్ల క్రింద వ్రాసిరి.  ఆయన భారద్వాజసగోత్రుడు. ఆయన తల్లి గారి పేరు గంగమాంబ. ఇంతకంటే ఆయన గురించిన వివరములు తెలియ రాలేదు.
ఈ శతకములోని నూరు కంద పద్యములు శ్రీ కృష్ణుని లీలలను వర్ణించుచు, భక్తి తత్వమును ప్రబోధిస్తూ ఆయనచే వ్రాయబడినవి. 



కాని దురదృష్ట వశాత్తూ  మూలప్రతిలో అనేక భాగములు పాడగుటచే  కొన్ని పంక్తులు తెలుగు తెలిసిన కొందరిచే తిరగ వ్రాయబడినవి.   వీరు  పురాణ, ఇతిహాసములతో అంత పరిచయము  ఉన్నవారు  కాక పోవడముతో కొన్నిచోట్ల తప్పులు దొర్లి, అర్థములు కూడా మారినవి. 

ఉదాహరణకు 7 వ పద్యములో  ‘శుక్రార్చిత నన్ను కరుణ జూడుము కృష్ణా’ అనే పంక్తి బజారులో దొరికే చాలా పుస్తకాలలో ఉన్నది.  నిజానికి ‘శుక్రార్చిత’ అనే మాటకు విలువ లేదు. ఎందుకంటే శుక్రుడు విష్ణువును  ఎన్నడూ  అర్చించలేదు. సరికదా, విష్ణువుతో వైరము పెట్టుకొన్నాడు. 
ఇలాంటి తప్పులను మరియు అనేక ప్రక్షిప్తాలను  ఇప్పుడు మంచి తెలుగు పండితులచే జాగ్రత్తగా దిద్దించి, కృష్ణ శతకమును ఈ బ్లాగ్ లో ఉంచడము జరిగినది.  పాఠకులు దీనిని సహృదయముతో గ్రహింపగలరు.

ఈ బ్లాగ్ లో కృష్ణ శతకమును అచ్చుతప్పులు కూడా లేకుండా తిరగరాయడానికి ప్రయత్నము చేయడము జరిగినది. కొన్ని కఠిన పదాలకు అర్ధములు, అక్కడక్కడ వివరణలు ఇవ్వడము జరిగినది. పాఠకులు తప్పులేమైనా గమనించి  నిరూపిస్తే, వాటిని దిద్దడము జరుగుతుంది. 

మొన్న ఆగష్టు 9 -10 తేదీలలో  కృష్ణాష్టమి నాడు ఈ శతకాన్ని తిరగరాయడం మొదలుపెట్టి,  నా కంప్యూటర్లో ఉంచడము జరిగినది. ప్రారంభించిన కొన్ని దినాలలోనే 100  పద్యాలను పూర్తి చేయగలగడానికి ఆ శ్రీ కృష్ణుని పై భక్తి శ్రద్ధలు, మరియు ఆయన కృపయే కారణము.
భక్తి ప్రధాన మైన ఈ శతకాన్ని అందరూ చదివి ఆనందించండి.

No comments: