Monday, August 20, 2012

Krishna Satakamu - కృష్ణ శతకము - Poems 41-45


41.
వడుగవు వై  మూడడుగుల
నడిగితి వౌ బలిని భళిర! యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణా

 Tough words:  వడుగవు వై = వటువు వై, వామనుడ వై
42.
ఇరువదొక మార్లు నృపతుల
శిరముల ఖండిచి తౌర! చేగొడ్డంటన్ 
ధర కశ్యపునకు నిచ్చియు
బరగవె! జమదగ్ని రామభద్రుడ! కృష్ణా

Tough words: చేగొడ్డంటన్ = చేతి గొడ్డలిచే;    పరగవే = ఒప్పవే
జమదగ్ని రామభద్రుడు = పరశు రాముడు
43.
దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చు కొనియు నయోధ్యన్
విశదముగ కీర్తి నేలిన
దశరధ రామావతార! ధన్యుడ! కృష్ణా
44.
ఘనులగు ధేనుక ముష్ఠిక
దనుజుల జెండాడి తౌర! తగు భుజ శక్తిన్
అనఘాత్మ! రేవతీపతి
వనగా బలరామ మూర్తి వౌగద కృష్ణా 
45.
త్రిపురాసుర భార్యల నతి
నిపుణత తో వ్రతము చెరిపి నిలిపితి కీర్తుల్
కృపగల రాజువు భళిరే!
కపటపు బౌద్ధావతార! ఘనుడవు కృష్ణా
Commentary: త్రిపురాసురులు తమ భార్యల పూజా నియమముల చేత, వారి జ్ఞానము చేత, వారి పాతివ్రత్యము చేత అత్యంత శక్తిమంతులై లోకములను హింసింప సాగిరి.  అపుడు విష్ణుమూర్తి కపట బుద్ధావతారము నెత్తి దిగంబరుడై  ఆ భార్యలకు శూన్య వాదము బోధించి, వారిని ఒప్పించి, వారి జ్ఞానము నశింప జేసెను. అంతట  వారు పూజాదికాలు మానిరి. దానితో త్రిపురాసురుల శక్తి నశించెను.  పిమ్మట   త్రిపురాసురులను శివుడు సంహరించెను. ఇది బుద్ధావతార కథ.
కృపగల రాజువు = మరల కలియుగములో త్రిపురాసురులు   శుద్ధోదనుడను రాజుగా జన్మించిరి. శుద్ధోదనుడు తపస్సుతో జ్ఞానము సంపాదించెను. అతని జ్ఞానమే అతని శక్తి.   కానీ అతని పూర్వ దుష్ట గుణములు పోవయ్యెను.   అందువలన అతడు తిరిగి విజృంభించకుండా  అతని జ్ఞానమును చెరుపవలసి వచ్చెను.
అపుడు విష్ణువు అతని కొడుకు సిద్ధార్ధునికి వైరాగ్యము పుట్టించి ఇంటినుండి వెడలిపోవునట్లు చేసెను. మరియు బోధి వృక్షము క్రింద  సిద్ధార్ధునికి కపట జ్ఞానము లేదా శూన్య వాదమును స్ఫురింప జేసెను.
తరువాత  సిద్ధార్ధుడు శుద్ధోదనుని వద్దకు వచ్చి అతనికి కపట జ్ఞానము లేదా శూన్య వాదమును బోధించి అతని జ్ఞానమును నశింప జేసెను. మరియు అతనిని తన శిష్యునిగా స్వీకరించి నిర్వీర్యుని చేసెను.  సిద్ధార్ధుడే కృపగల రాజు.

No comments: