Saturday, August 25, 2012

Krishna Satakamu - కృష్ణ శతకము - Poems 66-70

66.
బలమెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు రవిసుతునకు
బలమెవ్వడు నాకు నీవు బలమౌ కృష్ణా

Tough words:  రవిసుతుడు = సుగ్రీవుడు
67.
పరుసము సోకిన ఇనుమును
వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి! నీ నామము సోకిన
సురవందిత నేను నటుల,  సులభుడ కృష్ణా

Tough words:  పరుసము= ఇనుమును బంగారము చేయు ఒక మూలిక;
వడుపున= మాదిరిగా;  జిహ్వ= నాలుక; 
నేను నటుల= నేనున్+ అటుల
68.
ఒకసారి  నీదు  నామము
ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్
వికలములై తొలగుటకును
సకలార్ధా! సాక్షి యజామీళుడు కృష్ణా

Tough words:  ప్రకటముగా = పైకి వినిపించునట్లు, గట్టిగా; వికలములై = విరిగినవై
సకలార్ధా = సకలమైన పురుషార్ధములు (కోరికలు) ఇచ్చువాడు 
69.
హరి యంతయు గలడా? యని
గరిమను దైత్యుండు బలుక, కంబము లోనన్
ఇరవొంద వెడలి చీల్చవె
శరణను ప్రహ్లాదకుండు సాక్షిగ కృష్ణా

Tough words:  గరిమను= గొప్పగా;   దైత్యుండు= హిరణ్యకశిపుడు;
ఇరవొంద = ఇరవు+ పొంద ; ఇరవు = స్థానము;  అనగా స్తంభమును స్థానముగా చేసికొని
70.
భద్రార్చిత పదపద్మ!  సు-
భద్రాగ్రజ సర్వలోక పాలక!  హరి! శ్రీ- 
భద్రాధిప! కేశవ! బల-
భద్రానుజ! నన్ను బ్రోవు భవహర కృష్ణా

Tough words:  భద్రార్చిత = 'భద్ర'  అను భార్యచే  అర్చింపబడు వాడు;
శ్రీ భద్రాధిపుడు  = భద్రాద్రికి పాలకుడైన శ్రీరాముడు
బలభద్రానుజుడు= బలరామునికి తమ్ముడు 

No comments: